Friday, December 20, 2024

చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

వలలో చిక్కుకున్న ప్రొబేషనరీ ఐపిఎస్
న్యూడ్ కాల్‌తో వేధింపులు..
డబ్బులు పంపాలంటూ డిమాండ్..
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సామాన్యులనే కాదు, ఐపిఎస్‌లను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రొబేషనరీ ఐపిఎస్‌ను సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురిచేయడం తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది. భాగ్యనగరంలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఓ ప్రొబెషనరీ ఐపిఎస్‌కు సైబర్ ముఠా ఇటీవల వీడియో కాల్ చేసింది. ప్రొబెషనరీ ఐపిఎస్ కాల్ లిఫ్ట్ చేశారు. అటు వైపు నుంచి మాట్లాడుతున్న యువతి ఉన్నట్టుండి నగ్నంగా మారింది. దీంతో వెంటనే సదరు ప్రొబేషనరీ ఐపిఎస్ కాల్ కట్ చేశారు. అయితే ఆ సమయానికే సైబర్ ముఠా కాల్ రికార్డ్ చేసింది. ఆ వీడియోను ప్రొబేషనరీ ఐపిఎస్‌కు పంపి వేధింపులకు దిగింది. డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేస్తుండటంతో ఈ విషయమై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రొబెషనరీ ఐపిఎస్ ఫిర్యాదు చేశారు.

ఇప్పటి వరకు సామాన్యులను, కొందరు అధికారులనే వేధించిన సైబర్ నేరస్తులు ఇప్పుడు పోలీసుల వరకు రావడమే కాకుండా ఐపిఎస్‌లను కూడా టార్గెట్ చేస్తున్నారు. పోలీసులకు కూడా దొరక్కుండా తప్పించుకోగలమన్న ధీమాతో సైబర్ గ్యాంగ్‌లు ఇంతగా బరితెగిస్తున్నాయి. మరోవైపు సైబర్ నేరగాళ్ల వేధింపులకు పలువురు బలవుతున్నారు. పరువు పోతుందన్న భయం, అవమాన భారం భరించలేకపోతున్నారు. వీటినే ఆయుధాలుగా మలుచుకుని సైఐర్ గ్యాంగ్‌లు యధేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఎంతటి వారయితే ఏం… తమ వలలో చిక్కితే అంతే అంటూ వేధింపులకు సైబర్ నేరగాళ్లు దిగుతున్నారు. ఈ సైబర్ రాకాసుల పని పట్టకపోతే ఇంకెంత మంది వారి వలలో చిక్కుకుని నరకం చూసే అవకాశం ఉంది. పైపెచ్చు అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకుని మరీ సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేస్తున్నారు. ఇలాంటి సైబర్ గ్యాంగ్‌లకు చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేని పక్షంలో రోజురోజుకూ వీరి ఆగడాలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రొబెషనరీ ఐపిఎస్‌నే వేధిస్తున్నారంటే ఇక సామాన్యులకు సైబర్ నేరస్తుల నుంచి రక్షణ కలిగేది ఎప్పుడు? అనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మరి ఈ సైబర్ గ్యాంగ్‌ల పనిపట్టి, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖాధికారులపైనే ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News