Monday, January 20, 2025

యాప్‌లతో కొట్టేస్తున్న సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుతో అమాయకులను నమ్మిస్తు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్యాంక్ అధికారులు తమ ఖాతాదారులకు ఫోన్ చేసి ఎలాంటి వివరాలు అడుగరని చెబుతున్నా కూడా ఖాతాదారుల్లో మార్పు రావడంలేదు. పేటిఎం తదితర వాటికి కేవైసి అప్‌డేట్ చేయకపోతే ఆగిపోతుందని బెదిరించడంతో చాలామంది బ్యాంక్ ఖాతాదారులు సైబర్ నేరస్థులు అడిగి వివరాలు చెబుతున్నారు. బాధితులు చెప్పిన వివరాలతో సైబర్ నేరస్థులు వారి ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నారు.

యాప్‌లతో మోసం…
సైబర్ నేరస్థులు పేటిఎం వాడుతున్న వారిని టార్గెట్ చేసుకుని వారికి కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటికి స్పందించిన వారికి ఫోన్ చేసి కేవైసి వివరాలు తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. దానిని నమ్మి డౌన్‌లోడ్ చేసుకున్న వారికి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఎనీ డెస్క్ యాప్, క్విక్ సపోర్టు యాప్, టీమ్ వ్యూవర్ యాప్ తదితర వాటి ద్వారా సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రూ.100 మాత్రమే పంపివ్వమని చెప్పడంతో బాధితులు సులభంగా నమ్ముతున్నారు.

బాధితులు…
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లికి చెందిన రవిశంకర్ తన మొబైల్ ఫోన్‌కు 8308969378 నంబర్ నుంచి కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. తర్వాత ఫోన్ చేసి పిటిఎం వివరాలు చెప్పాలని, కేవైసి అప్‌డేట్ చేసుకోవాలని చెప్పాడు. దానిని నమ్మిన సైబర్ నేరస్థుడు చెప్పినట్లు ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రూ.100 పంపించాడు. ట్రాన్‌జాక్షన్ ఫేయిల్ అని రావడంతో వచ్చింది, సైబర్ నేరస్థులు పేటిఎం ఖాతాను హ్యాక్ చేయడంతో అలా వచ్చింది. కొద్ది సేపటి తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి రూ.62,542 పేటిఎం ద్వారా విత్‌డ్రా చేసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి 19 ట్రాన్‌జాక్షన్స్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. తర్వాత సైబర్ నేరస్థుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ ట్రాన్‌జాక్షన్ చేసినట్లు తేలింది. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్విక్ సపోర్ట్ యాప్…
పేటిఎం కేవైసిని అప్‌డేట్ చేసుకోవాలని క్విక్ యాప్‌తో డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పొందుపర్చాలని చెప్పడంతో సంఘారెడ్డి జిల్లా, రామచంద్రాపురం, వినాయకనగర్‌కు చెందిన ఫక్రుద్దిన్ మహ్మద్ గత నెల 23వ తేదీన సైబర్ నేరస్థులు ఫోన్ చేసి బాధితుడిని వివరాలు పొందుపర్చాలని, తర్వాత రూ.1 పంపించాలని తెలిపారు. ఇది నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేశాడు. ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిఐ ద్వారా నుంచి ఐదు ట్రాన్‌జాక్షన్ల ద్వారా రూ.78,399 విత్‌డ్రా చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెసేజ్‌లు, కాల్స్‌ను నమ్మవద్దుః పోలీసులు
గుర్తుతెలియని వ్యక్తులు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేస్తే స్పందించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. పేటిఎం నిర్వాహకులు ఎలాంటి వివరాలు అడగడంలేదని తెలిపారు. ఎవరు అడిగినా కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు చెప్పవద్దని కోరారు. యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు వాటిని ఒకసారి తనిఖీ చేయాలని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ముందు ఒకసారి చెక్‌చేసుకోవాలని అన్నారు. యాప్‌ల ద్వారా సైబర్ నేరస్థులు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News