సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు మహిళలను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లో ఎక్కువమంది బాధితులు మహిళలు ఉన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. ముందుగా వారిని నమ్మించేందుకు పలు రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు. తర్వాత వారిని బ్లాక్‌మేయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. పార్సిల్, పార్ట్‌టైమ్ జాబ్, ట్రేడింగ్, పెట్టుబడి ఇలా చాలా పేర్తు చెప్పి మహిళలను నమ్మిస్తున్నారు. సైబర్ నేరస్థులు చెప్పే మాటలను నమ్ముతున్న మహిళలు కోట్లాది రూపాయలు వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.
కొద్ది రోజుల గడిచాకా కానీ వారికి విషయం అర్ధం కావడంలేదు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి అసలు విషయం చెబుతున్నారు. అనుమనితి మెసేజ్‌లకు, ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది పట్టించుకోవడంలేదు. మహిళలు ఇంటి వద్ద ఉండి భారీగా డబ్బులు సంపాదించవచ్చని అత్యాశకు పోయి తమ వద్ద ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మహిళలకు ఉన్న వీక్‌నెస్‌ను సైబర్ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో పోలీసులు గేటేడ్ కమ్యూనిటీ, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా మహిళలు సైబర్ నేరస్థుల చేతుల్లో పడి మోసపోతున్నారు.
సోషల్ మీడియా వేదికగా…
సైబర్ నేరస్థులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. ఇందులో పలు మోసపూరిత ప్రకటనలు ఇస్తూ మహిళలను ఆకర్శిస్తున్నారు. వాటి పట్ల ఆసక్తి చూపిన మహిళలకు వరుసగా టెలీకాలర్లతో ఫోన్లు చేయించి వారి జానర్ నుంచి వెళ్లకుండా చేస్తున్నారు. తర్వాత మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన మహిళకు వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. దీనికి స్పందించిన మహిళ ఇంటి వద్దే ఉండి సంపాదించవచ్చని అనుకుంది. వెంటనే సైబర్ నేరస్థులు పంపిన మెసేజ్‌కు రెస్పాండ్ కావడంతో మేము పనిఇస్తామని తాము చెప్పినట్లు చేయాలని చెప్పారు. కొద్ది రోజులు అలాగే చేసి వారికి పంపించింది. ఈ క్రమంలోనే నిందితుల నుంచి లీగల్ నోటీసు వచ్చింది. తాము చెప్పిన ఫార్మాట్‌లో పనిచేయలేదని, కోర్టులో కేసు వేశామని బెదిరించారు. దీనికి భయపడిన మహిళ సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసింది.
కోర్టులో కేసు వేయకుండా ఉండేందుకు రూ.6లక్షలు ఇవ్వాలని చెప్పడంతో వెంటనే వారు పంపించిన బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపింది. తర్వాత తనకు పంపించిన లీగల్ నోటీసులు నకిలీవని తెలియడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన బాధితురాలికి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు పార్సిల్ వచ్చిందని చెప్పారు. దానిలో ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. పోలీసులు వచ్చి విచారిస్తారని చెప్పడంతో బాధితురాలు భయభ్రాంతులకు గురైంది. తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో సదరు బాధితురాలు వెంటనే తన వద్ద ఉన్న డబ్బులను వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు రూ.98లక్షలు పంపించింది. తర్వాత ఆలోచించిన మహిళ తానకు ఎవరు పార్సిల్ పంపారనే విషయం తెలియకపోవడంతో వెంటనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో కేసులో నగరానికి చెందిన మహిళకు సైబర్ నేరస్థులు ఫోన్లు చేశారు.
తాము చెప్పిన కంపెనీల్లో పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. దీనిని నమ్మిన బాధితురాలు సైబర్ నేరస్థులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు కోటి రూపాయలు పంపించింది. నిందితులు చెప్పిన గడువు ముగిసినా కూడా తాను పెట్టిన పెట్టుబడిలో తగ్గాయి తప్ప పెరగలేదు. ఉన్న వాటిని విత్ డ్రా చేసుకుందామని చూస్తే సాధ్యం కాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.