Friday, December 20, 2024

వృద్ధులను టార్గెట్ చేసిన సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డబ్బులు దోచుకోవడానికి సైబర్ నేరస్థులు ఎవరినీ వదలడంలేదు. చివరికి వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వరుసగా నేరాలు చేస్తున్నారు, వారికి మాయమాటలు చెప్పి బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఖాతాల్లో ఉన్న డబ్బులను మొత్తం దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా మూడు పోలీస్ కమిషనరేట్లలో చోటుచేసుకుంటున్నాయి. గతంలో డిడి కాలనీకి చెందిన వృద్ధుడికి సైబర్ నేరస్థులు ఫోన్ చేసి మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ అయిందని, వెంటనే రెన్యూవల్ చేసుకోకపోతే బ్లాక్ చేస్తామని చెప్పడంతో వెంటనే బాధితుడు సైబర్ నేరస్థులు అడిగిన వివరాలు చెప్పాడు.

అంతే నిందితులు వృద్ధుడి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం వేరే వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత వృద్ధుడు బ్యాంక్‌కు వెళ్లి తన ఖాతా వివరాలు అడిగే సరికి బయటపడింది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బేగంపేటకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు మీ తాము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని మీ కెవైసి వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరారు. లేకుండా బ్యాక్ ఖాతాను బ్లాక్ చేస్తామని చెప్పడంతో సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేశాడు. నిందితులు తాము మీ మొబైల్ నంబర్‌కు లింక్ పంపిస్తామని దానిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని చెప్పారు.

దీనిని నమ్మిన వృద్ధుడు వారు పంపించిన లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేశాడు. తర్వాత వారు అడిగిన ఓటిపిని సైబర్ నేరస్థులకు చెప్పాడు. వెంటనే నిందితులు వృద్ధుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2లక్షలు దోచుకున్నారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత వృద్ధుడి మొబైల్‌కు డబ్బులు వేరే బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన మరో వృద్ధుడిని కూడా ఇలాగే సైబర్ నేరస్థులు మోసం చేసి అతడి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మొత్తం దోచుకున్నారు.

అవగాహన లేకపోవడమే…
ఎక్కువగా సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోతున్న వారిలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. వీరికి నెలనెలా పింఛన్ బ్యాంక్ ఖాతాల్లో పడడంతో వారిని సైబర్ నేరస్థులు టార్గెట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు కూడా బ్యాంక్‌తో సంబంధం ఉండడంతో సైబర్ నేరస్థులు చెప్పిన విషయాలను నమ్మి నిండామునుగుతున్నారు. పదవీవిరమణ చెందిన వృద్ధులకు ఇటీవల జోరుగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన లేకపోవడంతో బాధితులుగా మారుతున్నారు. బ్యాంక్ అధికారుల వలే సైబర్ నేరస్థులు ఫోన్ చేసినా గుర్తించక, బ్యాంక్ వారే ఫోన్ చేస్తున్నారని నమ్మి వారు అడిగిన వివరాలు చెబుతున్నారు.

వారి చేతిలో మోసపోయిన కొద్ది రోజుల తర్వాత మాత్రమే వారికి తెలుస్తోంది. కొందరు మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌లను చూసి అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు తమ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కొట్టేసిన విషయం బ్యాంక్‌కు వెళ్లి బ్యాలెన్స్ అడిగితే కాని తెలియడంలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డబ్బులు తిరిగి వస్తున్నాయి కానీ, చాలా రోజుల తర్వాత చేసిన వారికి రావడంలేదు. సైబర్ నేరాల్లో నేరం చేసిన వారు దొరుకుతారు కానీ, డబ్బులు మాత్రం తిరిగి రావడంలేదు. నేరస్థులు అతితెలివితో డబ్బులు రాగానే వెంటనే వాటిని ఖర్చు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News