Tuesday, April 15, 2025

సిలికాన్ వాలీగా సైబరాబాద్

- Advertisement -
- Advertisement -

రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం బాసట
కాంగ్రెస్ పాలనలో నిర్మాణ రంగం విస్తరణ
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : సైబరాబాద్ నగరం భవిష్యత్‌లో ఆసియాలోని సిలికాన్ వాలిగా రూపాంతరం చెందనుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రోజు రోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం సైబరాబాద్ లోని నోవాటెల్ లో జరిగిన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ తొలి వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.

హైదరాబాద్, సైబరాబాద్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న నిర్మాణ రంగానికి అనుగుణంగా ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం మందగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ప్రస్తావిస్తూ భవిష్యత్ పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ పరంగా ఆటంకాలు ఎదురైతే సత్వరమే పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. హైదరాబాద్ నుండి సైబరాబాద్ వరకు జరుగుతున్న అభివృద్ధిలో నిర్మాణ రంగంలో ఉన్న వారికి చేయూతనందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా నిర్మాణరంగాన్ని ఎలా ప్రోత్సాహించిందో అన్నది జగద్విదితామేనన్నారు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ రాజీవ్ గాంధీ విమానాశ్రయం మొదలుకుని ఔటర్ రింగ్ రోడ్, పి.వి నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే, మెట్రో రైలు నెట్ వర్క్‌లతో పాటు మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా,గోదావరి జలాశయాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అన్నది విస్మరించ కూడదన్నారు.

శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మహానగరంలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక సంస్కృతికి హైదరాబాద్ పెట్టింది పేరు అని, ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న దృష్ట్యా శాంతిభద్రతలు పరిరక్షణతో పాటు సామాజిక సమతుల్యత దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. మహానగరంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కృష్ణా, గోదావరి జలాలను రప్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, ఇక్కడ తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అదే సమయంలో అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగితిస్తున్నామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ చర్యలకు ఉపక్రమించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుదారులను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా వసతులు కల్పిస్తుందన్నారు. అందులో భాగంగానే భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. మూసీ నది పునరుద్ధరణ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ లండన్ లోని థెమ్స్ ,పారిస్ లోని సైన్, సియోల్ లోని హాన్ నదిలా మరబోతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి అయిన మీదట హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగే నగరంగా రూపొందుతుందన్నారు. అటువంటి హైదరాబాద్ నగరంలోని నిర్మాణరంగంలో ఉన్న వారికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News