మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్, రికార్డుల నిర్వహణ గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, జిడి ఎంట్రి తదితర రికార్డులను పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే విధమైన పోలీసు సేవలను అందిచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. పోలీస్ స్టేషన్‌లో ప్రతి విభాగాన్ని విభజించి క్రమపద్ధతిలో ఉంచుకోవాలన్నారు. 17 వర్టీకల్స్ రిసెప్షన్ స్టాఫ్, స్టేషన్ రైటర్, క్రైం రైటర్, బ్లూకోట్స్, పెట్రోల్ స్టాఫ్, కోర్టు వర్కింగ్ స్టాఫ్, వారెంట్ స్టాఫ్, సమన్స్ స్టాఫ్, టెక్‌టీమ్, ఇన్వెస్టిగేషన్ స్టాఫ్, క్రైం స్టాఫ్, మెడికల్ సర్టిఫికేట్ స్టాఫ్, స్టేషన్ ఇన్‌చార్జి, జనరల్ డ్యూటీ స్టాఫ్, డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, అడ్మిన్ ఎస్సైల గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ మెథడ్‌లోని సార్ట్, సెట్, షైన్, స్టాండర్‌డైజ్, సస్టేయిన్ గురించి వివరించారు.
క్రైం వర్టికల్‌లో పనిచేసే సిబ్బంది వారి పిఎస్ పరిధిలోని పాతనేరస్థులు, సస్పెక్ట్‌లపై నిఘాను ఉంచాలన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారం, ఆధునికతను ఉపయోగించి నేరస్థులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి సంబంధించి స్టేషన్ సిబ్బంది అనుసరిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణకు ఉపయోగించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో డిసిపి వెంకటేశ్వర్లు, ఎసిపి చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ నర్సింగరావు, డిఐ శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.