హైదరాబాద్: కస్టమర్ కేర్ అనుకుని ఫోన్ చేసిన నగరంలోని ఓ ఇన్స్‌స్పెక్టర్ భార్యను సైబర్ నేరస్థులు నిండాముంచారు. పోలీసుల కథనం ప్రకారం…. నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గట్టుమల్లు భార్య ఆన్‌లైన్‌లో చీరను కొనుగోలు చేసింది. తాను ఆర్డర్ ఇచ్చిన చీరకు బదులుగా వేరు డిజైన్ చీరను పంపించారు. దీంతో ఇన్స్‌స్పెక్టర్ భార్య కస్టమర్ కేర్ వారితో మాట్లాడాలని గూగుల్‌లో సెర్చ్ చేసి అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసింది. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్థులు తాము సంస్థ ప్రతినిధులమని డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చింది. వాటి ఆధారంగా సైబర్ నేరస్థులు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సిఐ భార్య నగర సైబర్ క్రైం పోలీసులకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
Cybercriminals cheated on inspector’s wife