Monday, December 23, 2024

టెలీగ్రాంపై సైబర్ నేరస్థుల నజర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పలు యాప్‌లను వేదికగా చేసుకుని మోసాలు చేస్తున్న సైబర్ నేరస్థులు ఇప్పుడు టెలీగ్రాంను ఉపయోగించుకుంటున్నారు. టెలీగ్రాం యుజర్లను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేస్తున్నారు. వారికి లింకులు, గిఫ్ట్‌ల పేరుతో మెసేజ్‌లు పంపి మోసం చేస్తున్నారు. బాధితులకు మాయమాటలు చెప్పి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. టోలీచౌకికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి కొద్ది రోజుల క్రితం ఓ యువతి మెసేజ్ పంపించింది. యూట్యూబ్ వీడియోలు, అందులో వచ్చే ప్రకటనలను క్లిక్ చేసి పూర్తిగా చూడాలని, ప్రతి క్లిక్‌కు డబ్బులు వస్తాయని చెప్పింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని నమ్మించింది.

అంతేకాకుండా కమీషన్ డబ్బులు కూడా ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తామని చెప్పింది. ఇది నమ్మిన బాధితుడు క్లిక్ చేస్తేనే లక్షలాది రూపాయల డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. వెంటనే సదరు యువతి చెప్పినట్లు వారి బ్యాంక్ ఖాతాలో విడతల వారీగా రూ.65లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయినా కూడా యువతి మళ్లీ ఫోన్ చేసి మరో పది లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారిని కూడా సైబర్ నేరస్థులు వదలడంలేదు. చాలామంది పెట్టుబడిదారులు టెలీగ్రాంలో షేర్‌మార్కెట్‌కు సంబంధించిన గ్రూపుల్లో ఉంటారు. వాటి వివరాలను తెలుసుకుంటున్న సైబర్ నిందితులు తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయిన నమ్మిస్తూ దోచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించాలని అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారిని టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరస్థులు టెలీగ్రాంలో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లకు స్పందించిన వారికి మాయమాటలు చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు.

రూట్ మార్చిన సైబర్ నేరస్థులు…
సాధారణంగా సైబర్ నేరస్థులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ తదితర సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నేరాలు చేసేవారు.వరుసగా నేరాలు జరుగుతుండడంతో పోలీసులు బాధితులకు అవగాహన కల్పించారు. చాలా వరకు వీటిలో వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని పోలీసులు విస్కృతంగా ప్రచారం కల్పించారు. దీంతో చాలా వరకు ఈ సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలకు చెక్‌పడింది. వీటిని వాడుతున్న వారు అప్రమత్తం కావడంతో సైబర్ నేరస్థులు రూట్‌మార్చి టెలీగ్రాంపై పడ్డారు. టెలీగ్రాం గ్రూపుల్లో వేలాది మందిని సభ్యులుగా చేర్చుకునే అవకాశం ఉండడంతో వాటిని సైబర్ నేరస్థులు ఉపయోగించుకుని నేరాలు చేస్తున్నారు. బాధితులకు టెలీగ్రాంలో మెసేజ్‌లు పంపిస్తున్నారు, వాటికి స్పందించిన వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News