న్యూఢిల్లీ : ఇటీవల అరేబియా సముద్రంలో నెలకొన్న బిపర్‌జాయ్ అత్యంత సుదీర్ఘంగా 13 రోజుల 3 గంటలు తిష్టవేసుకుని ఉన్న తుపాన్‌గా నిలిచింది. ఇది మందకొడిగా సాగి చివరికి గుజరాత్ తీరాన్ని ఈ నెలారంభంలో బలంగా తాకి తరువాత బలహీనపడింది. అయితే 1977లో హిందూ మహాసముద్రంలో తలెత్తిన ఎక్కువ సమయపు తుపాన్ తరువాత అత్యంత సుదీర్ఘ నిడివిలో నిలిచి ఉన్న తుపాన్‌గా బిపర్‌జాయ్ వాతావరణ విభాగం పుటల్లోకి చేరిందని అధికారులు తెలిపారు.ఈ ఏడాది అరేబియా సముద్రంలో తొలి తుపాన్‌గా బిపర్‌జాయ్ చోటుచేసుకుంది. ఈ నెల 6వతేదీన సముద్రంలో ఇది ఉత్పన్నం అయింది. చివరికి 15న తీరాన్ని తాకింది. ఈ నెల 18న బలహీనపడింది.
ఈ విధంగా ఈ తుపాన్ మొత్తంగా 13 రోజులు నిలిచి ఉంది. సాధారణంగా ఏ తుపాన్ కాల పరిమితి అయినా ఆరు రోజులు మూడు గంటల పాటు ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. ఇంతకు ముందు 1977లో హిందూమహాసముద్రంలో తలెత్తిన తుపాన్ 14 రోజుల ఆరుగంటల పాటు సాగింది. ఇటీవలి కాలంలో 2019లో అరేబియా సముద్రంలో వచ్చిన క్యార్ తుపాన్ అక్టోబర్‌లో 9రోజుల 15 గంటల వరకూ ఉంది. ఇప్పుడు వచ్చిన బిపర్‌జాయ్ తన ఉనికిదశలో అత్యంత నెమ్మదిగా రోజుకు కేవలం సగటున గంటకు 7.7 కిలోమీటర్లతో కదిలి రోజు వారిగా 12 గంటల మేరనే ప్రయాణించింది. ఇది వాతావరణ విభాగం విశ్లేషణలకు పనికి వచ్చే కీలక విషయం అయింది.