Monday, January 20, 2025

తుఫాన్ నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలి : తమ్మినేని వీరభద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మిగ్ జాం తుఫాన్ వల్ల రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వాస్తవానికి అంతకుమించి నష్టం జరిగిందని వెల్లడించారు. 1.5 లక్షల మంది రైతులు సుమారు రు.3500 కోట్లు నష్టపోయినట్లు అంచనా ఉందని, గొర్రెలు, బాతులు, పశువులు చనిపోయాయని నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి వెంటనే పరిహారం చెల్లించాలని, తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పంట సీజన్‌లలోనే నష్టం జరగడం ఇది రెండవసారి అని అన్నారు. అధిక వర్షాల వల్ల జూలైలో 12 లక్షల ఎకరాల్లో నష్టం జరగగా, 49 మంది మరణించారని తెలిపారు. ఎకరాకు రు.10వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎవరికీ చెల్లించలేదన్నారు.

ఇప్పుడు మళ్లీ పంట కోతకొచ్చిన తరుణంలోనే మరోసారి నష్టం జరిగిందని వెల్లడించారు. వరిపంట కేవలం 42శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయన్నారు. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం కూడా సౌకర్యాలు లేక తడిచిపోయి, ఆరబెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, ములుగు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. ఈ నష్టాన్ని రైతులు భరించే స్థితిలో లేరన్నారు. ఈ స్ధితిలో 2023-24లో 15వ ఆర్థికసంఘం కేటాయించిన రు.660 కోట్లకు తోడు, మరికొన్ని నిధులు కేటాయించి, జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Cyclone Michaung

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News