వచ్చే 24గంటల్లో ఉపరితల ఆవర్తనం
మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రానికి ‘గులాబ్’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుఫాను కేంద్రీకృతమైందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తుఫాను పశ్చిమ దిశగా కదులుతూ.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనున్నట్లు తెలిపింది. నేడు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలి వేగం అధికంగా 95 కిలోమీటర్లు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 24గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ తీరానికి 29వ తేదీన
రాగల 24 గంటల్లో ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆవర్తన ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరానికి 29వ తేదీకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12.6 సె.మీ.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.6 సెంటిమీటర్లు, పోచంపల్లి (కరీంనగర్)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 8.5, రంగారెడ్డిలో 10.3, హైదరాబాద్‌లో 9.3, నల్లగొండలో 8.5, సూర్యాపేటలో 8.1, మేడ్చల్ మల్కాజిగిరిలో 7.2, యాదాద్రి భువనగిరిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం
ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని వారు సూచించారు.
పెంచికలపేట ప్రధాన రహదారిపై…..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పెంచికలపేట ప్రధాన రహదారిపై సులుగుపల్లి సమీపంలోని తీగల ఒర్రె భారీ వర్షానికి ఉప్పొంగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వరదలతో ప్రతి ఏడాది తీగల ఒర్రె ఇలాగే ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. 2013లో వరద ఉధృతికి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ (42)గా గుర్తించారు. ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది. షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. రజనీకాంత్ కోసం 2 డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్ చెరువు వద్ద గాలింపు కొనసాగుతోంది.
ఘటన బాధాకరం: మంత్రి సబిత
మణికొండలో ఘటనాస్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరిశీలించి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘటన చాలా బాధాకరమన్నారు. నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సి ఉందని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకుంటామని సబిత తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.