అల్లకల్లోంగా మారిన సముద్రం
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండి
పలు మార్గాల్లో రైళ్లు రద్దు
చెన్నై ..విశాఖ విమారసర్వీసులు బంద్
మనతెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్‌జాం తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 210కి.మి, బాపట్లకు 310కిమి, మచిలీపట్నానికి 330 కిమి దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది తీవ్ర తుపానుగా బలపడనుందని ,మంగళవారం ఉదయానికి బాపట్ల తీరానికి సమీపంలో నిజాంపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఇప్పటికే తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. విశాఖ, చెన్నై కేంద్రాలనుంచి నుంచి విమానసర్వీసులు నిలిపివేశారు.
తమిళనాడు, ఏపిలో అయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకింద ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాయి. తుపాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఇప్పటికే సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా మారిపోయింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.