Wednesday, November 6, 2024

రెమాల్ తుపాన్ బీభత్సం..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన “రెమాల్ ” తుపాను కారణంగా మహారాష్ట్ర లోని మరట్వాడాలో గత రెండు రోజుల్లో ఏడుగురు పశ్చిమబెంగాల్‌లో నలుగురు చనిపోయారు. మరట్వాడా లోని డివిజనల్ కమిషనరేట్ నివేదిక ప్రకారం అకాల వర్షాల కారణంగా బీడ్, ధారాసివ్, లాతూర్ జిల్లాల్లో గత 48 గంటల్లో ఈ మరణాలు సంభవించాయి. 700 ఇళ్లు దెబ్బతిన్నాయి. 24.3 హెక్టార్ల లోని పంటలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రెమాల్ తుపాన్ తీరం దాటిన తరువాత విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుపాను ధాటికి బెంగాల్ వణికి పోయింది. 135 కిమీ వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. రైలు, మెట్రో రైలు సర్వీస్‌లతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కోల్‌కతాలో అనేకచోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాన్ కారణంగా సుందర్‌బన్‌లో ఇద్దరు, కొల్‌కతాలో ఒకరు, దక్షిణ పరగణాల జిల్లా మోసునీ ద్వీపంలో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సోమవారం ఉదయం నుంచి తుపాను బలహీన పడినట్టు వాతావరణశాఖ వెల్లడించింది.

దీంతో రాష్ట జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగం లోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్షకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో రాష్ట్రం ఊపిరిపీల్చుకున్నట్టయింది. నిలిపివేసిన విమానసర్వీస్‌లు 21 గంటల తరువాత తిరిగి ప్రారంభమైనప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎనిమిది విమానసర్వీస్‌లను గువాహతి, గయ, వారణాసి, భువనేశ్వర్ విమానాశ్రయాలకు మళ్లించారు. సోమవారం ఉదయం 8.59 గంటలకు ఇండిగో విమానం కోల్‌కతా నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరింది. విమానాశ్రయం లోని మౌలిక సౌకర్యాలు ఏవీ దెబ్బతినలేదని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సి పట్టాభి తెలిపారు. విమానాశ్రయంలో నీరు నిల్చిపోవడమేదీ లేదని , పంపుల ద్వారా నీటిని తోడివేయించామన్నారు. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీస్‌లకు అంతరాయం ఏర్పడింది. రెస్కూ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. గతంలో విధ్వంసం సృష్టించిన అంపన్ తుపానుతో పోలిస్తే రెమాల్ ప్రభావం తక్కువేనని కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ వెల్లడించారు.

తుపాను పరిస్థితిపై సిఎం మమత సమీక్ష
సుందర్బన్ ప్రాంతం గోసాబాలో తుపాన్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సుందర్‌బన్ ప్రాంతంతోపాటు కోస్తా తీరంలో రెమాల్ తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉదయం ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు తుపాన్ మిగిల్చిన నష్టాలపై సమీక్షించారు. చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికతో తుపాన్ తరువాత తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారని, ఎంతమంది మృతి చెందారో, ఎంతమంది గాయపడ్డారో వివరాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు. చెట్లు, కరెంట్‌స్తంభాలు కూలిపోవడం, ఇతర ఆస్తులకు నష్టం కలగడం, పునరుద్ధరణ చర్యలు గురించి వాకబు చేశారని చెప్పారు. తుపానుకు సంబంధించి కోల్‌కతాలో ఒకరు, దక్షిణ పరగణాల జిల్లా మోసునీ ద్వీపంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు బంగ్లాదేశ్‌లో 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News