Sunday, November 17, 2024

మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తూర్పు, మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయు గుండం మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర ‘యాస్’ తుపానుగా మారుతుందని, బుధవారం ఉదయానికి వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం వైపు వెళ్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. మంగళవారం ఉదయానికి యాస్ తుపాను పారాదీప్‌కు ఆగ్నేయంలో 360 కిమీ, బాలాసోర్‌కు ఆగ్నేయంగా 400 కిమీ, దిఘాకు ఆగ్నేయంగా 450 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయం తీరం దాటే సమయంలో గంటకు 165 నుంచి 185 కిమీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 26 వ తేదీ వరకు తీరంలో కఠిన పరిస్థితులు ఉంటాయని, అందువల్ల గురువారం వరకు మత్సకారులు సముద్రం లోకి వెళ్ల రాదని హెచ్చరించింది. యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వ బలగాలను అప్రమత్తం చేసింది. ఆయా ప్రాంతాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో భారత వాయుసేన సిద్ధంగా ఉంది.
ఇడిశా అప్రమత్తం
యాస్ తుపాన్ ముంచుకు వస్తుండడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపునకు గురి కానున్న ప్రాంతాలను గురించి అక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. గాలులకు ఓ పూరి గుడిసె కొట్టుకు పోగా, అందులో ఉన్న 91 ఏళ్ల వృద్ధురాలిని ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. తూర్పు, మధ్య బంగాళాఖాతం పరిధి లోని అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగసి పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, క్రిష్ణపట్నం రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు.

Cyclone Yaas: Heavy Rains in 3 States

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News