Saturday, November 23, 2024

యాస్ తుపాన్ ఎఫెక్ట్: నీట మునిగిన కోల్‌కతా..

- Advertisement -
- Advertisement -

Cyclone Yaas: Heavy Rains in Kolkata

బాలాసోర్/థిఘా/కోల్‌కతా/రాంచీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రస్థాయి తుపాన్‌గా రూపాంతరం చెందింది. ఉత్తర ఒడిషా, పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ బీచ్‌టౌన్ల మీదుగా గంటకు 130 నుంచి 145 కిలోమీటర్ల వేగపు గాలులతో దూసుకుపోయింది.దీనితో తూర్పు ప్రాంతపు రాష్ట్రాలు అయిన బెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరోవైపు బుధవారం నిండుపౌర్ణమి. ఇదే రోజు చంద్ర గ్రహణం ఏర్పడడంతో తుపాన్ ధాటికి ఎగిసిపడే అలలు మరింతగా ప్రకోపించే అవకాశం ఉందని వాతావరణ విభాగం నిపుణులు హెచ్చరించారు. కోల్‌కతాలో తుపాన్ తాకిడితో అత్యధిక వర్షాలు కురిశాయి. దీనితో పలు లోతట్టు ప్రాంతాలు, మురికివాడలలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈ నీళ్లలో నుంచే జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. తీవ్రస్థాయి తుపాన్ గా మారిన యాస్ ఒడిషాలో తీరం దాటింది. దీంతో ఒడిషాతో పాటు బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.

పలు గ్రామాలలోకి సముద్ర జలాలు
తుపాన్‌తో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పలు గ్రామాలలోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. బాహానాగా, బాలాసోర్ జిల్లాలోని రెమునా బ్లాక్‌లోని పలు గ్రామాలు సముద్రపు నీట మునిగాయి. భద్రక్ జిల్లాలోని ధమ్రా, బాసుదేవ్‌పూర్ ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టినట్లు ఒడిషా ప్రత్యేక సహాయక చర్యల కమిషనర్ పికె జెనా తెలిపారు. గురువారం వరకూ తుపాన్ ప్రభావంతో సముద్రం కల్లోలంగానే ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఒడిషాలో ఇప్పటికీ దాదాపు ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బెంగాల్ అతలాకుతలం: మమత
బెంగాల్‌లో యాస్ తుపాన్ పెను విధ్వంసాన్ని సృష్టించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. దాదాపు కోటి మంది బాధితులు అయ్యారు. ఇప్పటికే మూడు లక్షల వరకూ ఇళ్లు ధ్వంసం అయ్యాయని వివరించారు. బెంగాల్‌ను ఈ తుపాన్ బాగా దెబ్బతీసిందన్నారు. తుపాన్ సంబంధిత ఘటనలతో ఇప్పటికీ ఓ వ్యక్తి చనిపోయినట్లు తెలిసిందని, ఈ వ్యక్తిని సహాయక సిబ్బంది సకాలంలో రక్షించినా తరువాత చికిత్స దశలో మృతి చెందినట్లు తెలిపారు. పలు ప్రాంతాలకు సహాయక సామాగ్రిని పంపించినట్లు వివరించారు. పలు ప్రాంతాలలో అధికార యంత్రాంగానికి తోడ్పాటు అందించేందుకు సైన్యం రంగంలోకి దిగింది.పలు ప్రాంతాలలో బీచ్ రిసార్ట్‌లు దెబ్బతిన్నాయి. సౌత్ 24 పరగణా జిల్లాలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. చాలా చోట్లా కచ్చా ఇళ్లు కూలాయి. జార్ఖండ్‌పై కూడా యాస్ ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యగా తూర్పు, పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలకు చెందిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు ఆగ్నేయ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

Cyclone Yaas: Heavy Rains in Kolkata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News