Monday, January 20, 2025

ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కారేపల్లి/హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలోని చీమలపాడులో బుధవారం తలపెట్టిన బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యకర్తలు కాల్చిన బాణాసంచా నిప్పురవ్వలుపడి గుడిసె అంటుకోగా, అందులో ఉన్న సిలిండర్ పేలి నలుగురు చనిపోయారు. ఇద్దరు విలేకరులు సహా 8మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు, వైరా ఎంఎల్‌ఎ లావుడ్యా రాములు నాయక్‌లకు ఘన స్వాగతం పలికే క్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతుండగా వేదిక సమీపంలో మూల మీద ఉన్న రాజన్న రాములుకు చెందిన యాచకుడి గుడిసెపై బాణాసంచా నిప్పురవ్వలు పడి అంటుకొని, మంటలు వ్యాపించాయి. ఎస్‌ఐ పి.రామారావు, తన సిబ్బందితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంటలు ఆర్పుతున్న క్రమంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోగా పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి ఒక్కో కాలు విరగగా, మరికొందరికి రెండు కాళ్లు విరిగాయి. సంఘటనా స్థలంలోతెగిపడిన కాళ్లు చెల్లాచెదురుగా పడి పోయాయి. బాధితుల కుటుంబ సభ్యుల, స్నేహితుల హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం విషాదకరంగా మారింది.

ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రజలంతా చెల్లాచెదురుగా ఎటువారటు పరుగులు తీయగా, ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. పేలిన సిలిండర్ సుమారు 200 మీటర్ల దూరంలో పడిపోయింది. క్షతగాత్రులను తక్షణ వైద్య సహాయం కోసం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారిని అజ్మీర మంగ్య, బానోతు రమేశ్, సందీప్, మహారాష్ట్రకు చెందిన మరో వలస కూలీ లక్ష్మణ్‌లుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో చీమలపాడుకు చెందిన అజ్మీర మంగ్య (30)కు భార్య లలిత, ఉమేష్, గణేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మంగ్యా బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త మాత్రమే కాక, చీమలపాడు ఐదవ వార్డు సభ్యుడు కూడా. మృతి చెందిన వారిలో మరొకరు బానోతు రమేష్ (40) స్టేషన్ చీమలపాడుకు చెందినవారు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన వలస కూలీ సందీప్‌కు రెండు కాళ్లను తొలగించారు. గాయపడిన వారిలో మండల విలేకరులు తేళ్ల శ్రీనివాసరావు కుడి కాలుకు గాయం కాగా, ఆంగోత్ కుమార్‌కు ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. కారేపల్లి సిఐ నూనె వెంకటేశ్వర్లు గన్ మెన్ నవీన్‌కు ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. తడికల పూడికి చెందిన తేజావత్ భాస్కర్‌కు ఎడమ కాలు విరిగి కుడికాలు నుజ్జు నుజ్జైంది.

చీమలపాడుకు చెందిన నారాటి వెంకన్నకు గాయాలు కాగా, గేటు కారేపల్లికి చెందిన ధరం సోత్ లక్ష్మణ్ కు ఎడమ కాలు నుజు నుజ్జు అయింది. క్షతగాత్రుడిని ఖమ్మం నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో, తిరిగి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి వీరిలో కొందరికి ఒక్కో కాలును, మరికొందరికి రెండు కాళ్లను తొలగించారు. సంఘటన జరిగిన వెంటనే నామా నాగేశ్వరరావు, లావుడియా రాములు నాయక్ లు హుటాహుటిన ఖమ్మం వెళ్లి, బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని, అదేవిధంగా క్షతగాత్రులకు పూర్తిగా ఉచిత వైద్య సహాయం అందిస్తామని, అవసరమైతే వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు ఆసుపత్రికి తరలిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మృతులకు రెండు లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని వైరా ఎంఎల్‌ఎ లావుడియా రాములు నాయక్ తెలిపారు.

ఘటనపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలవ్వడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపి నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : కెటిఆర్

వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ నేతలతో, అధికారులతో కెటిఆర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కెటిఆర్ ఆదేశించారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : హరీశ్‌రావు

కారేపల్లి అగ్నిప్రమాద ఘటనపై బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల గురించి మంత్రి ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నిమ్స్ తరలించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News