సబ్సిడీ మాయం ఇక అంతా వేయి రేటుకు?
పండుగల ముందు సర్కారీ లీల
పక్షం రోజుల్లో 50 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాసు ధర సిలిండర్‌కు రూ 25 పెరిగింది. సబ్సిడీ ధరకు వచ్చే గ్యాసు సహా అన్ని రకాల వంటగ్యాసు ధరలను పెంచుతూ బుధవారం చమురు కంపెనీలు ప్రకటన వెలువరించాయి. రెండు నెలల వ్యవధిలో ఇది వరుసగా మూడో హెచ్చింపు. పెరిగిన ధరలతో దేశ రాజధానిలో ఇకపై సబ్సిడీ సబ్సిడియేతర ఎల్‌పిజి ధర సిలిండర్‌కు రూ 884.50 అవుతుంది. ఇంతకు ముందు జులై 1వ తేదీన సిలిండర్‌కు రూ 25.50 పైసలు పెంచారు. ఇక నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరలు ఆగస్టు 1వ తేదీన సిలిండర్‌కు పాతిక చొప్పున పెరిగాయి. ఇదే విధంగా వాటిపై ఆగస్టు 18న కూడా భారం మోపారు. అయితే పార్లమెంట్ సెషన్ ఉన్నందున ఆగస్టు 1వ తేదీన సబ్సిడీయుత సిలిండర్ల ధరలు పెంచలేదని , పెంచితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు తలెత్తుతాయని భావించారని పరిశ్రమల వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే మొత్తం మీద సిలిండర్‌పై పెరిగిన ధర విలువ రూ 190 అయింది. ప్రభుత్వం పేద అల్పాదాయ వర్గాలకు 12 సిలిండర్లను సబ్సిడీ లేదా మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో సిలిండర్ల ధరల పెంపుదలతో ఈ సబ్సిడీల క్రమం పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది. అంతా దాదాపుగా ఒకే ధరకు అంటే సిలిండర్‌కు రూ వేయి చొప్పున చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనితో ఇంతకు ముందటి తమ సబ్సిడీ గ్యాస్ ఏదనే ప్రశ్నతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పక్షం రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధరలు రూ 50 పెరిగాయి.