Wednesday, January 22, 2025

పన్నూ హత్యకు కుట్ర కేసు.. చెక్ కోర్టులో నిఖిల్ గుప్తాకు ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు జరిగిన కుట్రకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రాజ్యాంగ కోర్టు అంగీకారం తెలిపింది. ఈ అప్పగింతను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో గుప్తా అప్పగింతపై ఆ దేశ జస్టిస్ మినిస్టర్ పావెల్ బ్లాజెక్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దిగువ కోర్టు తీర్పు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఇది రాజకీయ ప్రేరేపితమన్నే అతడి వాదనను కూడా తోసిపుచ్చింది. “ అతడి అప్పగింత వల్ల రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరుగుతుందని న్యాయస్థానం భావించడం లేదు” అని ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో అక్కడి కోర్టులో అతడి న్యాయపోరాటం ముగిసింది. గత ఏడాది జూన్ 30న చెక్ రిపబ్లిక్ పరిధి లోని ప్రేగ్‌లో అడుగుపెట్టిన వెంటనే నిఖిల్ గుప్తాను అక్కడి అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు గుప్తా కుట్ర పన్నినట్టు ఆరోపణలు మోపారు. మరోవైపు అతడిని తమకు అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్స్ ఇప్పటికే చెక్ ప్రభుత్వాన్ని కోరారు. భారత అధికారుల సూచనల మేరకు పన్నూ హత్యకు కొందరు కిరాయి హంతకులను నియమించేందుకు నిఖిల్ గుప్తా ప్రయత్నించాడన్నది ప్రధాన అభియోగం. మరోవైపు ఇప్పటికే వైట్‌హౌస్ ప్రతినిధులు భారత్ లోని సీనియర్ అధికారుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, కేసు దర్యాప్తుకు సహకరించాలని కోరారు. భారత్ కూడా ఈ అంశంపై దర్యాప్తు చేపట్టడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News