నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు అనుమతించింది. నిఖిల్ గుప్తా అప్పగింతపై తుది నిర్ణయం ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖకే వదిలేసింది.
అమెరికాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర జరిగిందని.. కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి పాత్ర ఉందని అమెరికా అటార్నీ కార్యాలయం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలో నిందితుడికి భారత అదికారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా అభియోగాలు నమోదుచేసింది. అమెరికా ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, దీనిపై తాము ఉన్నతస్థాయి విచారణ చేపట్టామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పన్నూ హత్య కోసం నిఖిల్‌కు భారత్ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని స్పష్టం చేసింది.
గత జూన్‌లో నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతుడు జైలులో ఉన్నాడు.అయితే, గుప్తాను తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్ పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్ కోర్టు.. గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు అనుమతించింది.