జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. 2024 ఏడాదికి గాను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డులతో అర్జున, ద్రోణాచార్య తదితర అవార్డులను కూడా రాష్ట్రపతి అందజేశారు. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన యువ సంచలనం మను బాకర్‌తో సహా మొత్తం నలుగురికి ఖేల్త్న్ర అవార్డులను అందజేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి. గుకేశ్, హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లు 2024 సంవత్సరానికి గాను ఖేల్త్న్ర అవార్డులను అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన జివాంజీ దీప్తి (పారా అథ్లెటిక్స్), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్)లకు అర్జున అవార్డులు లభించాయి. వీరితో పాటు మరో 32 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. అంతేగాక ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలను స్వీకరించారు. లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండ్ కొలాకో (ఫుట్‌బాల్) ద్రోణాచార్య పురస్కారాలను అందుకున్నారు. అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్), సరబ్‌జోత్ (షూటింగ్) తదితరులకు అర్జున అవార్డులను ప్రదానం చేశారు. సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సంగ్వాన్ (హాకీ)లకు ద్రోణాచార్య అవార్డులు లభించాయి.
తెలుగు తేజం దీప్తికి అర్జున
తెలంగాణ (వరంగల్)కు చెందిన స్టార్ పారా అథ్లెట్ జివాంజీ దీప్తి ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డును అందుకుంది. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా దీప్తి ఈ పురస్కారాన్ని స్వీకరించింది. పారా అథ్లెటిక్స్‌లో దీప్తి అసాధారణ ఆటతో అలరిస్తున్న విషయం తెలిసిందే. పారిస్ పారాలింపిక్స్‌తో సహా ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో దీప్తి పతకాలు సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డును ప్రకటించారు. మరోవైపు విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజీ కూడా అర్జున అవార్డును అందుకుంది.