మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య లోకాయుక్త దర్యాప్తును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం తమ పార్టీ నాయకుడు ఎవరూ పోటీ పడడం లేదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తెలిపారు. సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ సిద్దరామయ్య రాజీనామా కోసం డిమాండు చేసే ప్రశ్నే రాదని చెప్పారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రగా ఈ కేసును ఆయన అభివర్ణించారు. ఆ కేసులో బలం లేదని, ప్రతిపక్ష బిజెపి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, సిద్దరామయ్యకు తామంతా మద్దతు తెలియచేస్తున్నామని శివకుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్నట్లు వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న తానే ఆ పదవిని ఆశించనప్పుడు ఇతరులు ఆశించే అవకాశం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.