హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అర్వింద్ తీరును అన్న ధర్మపురి సంజయ్ తప్పుపడుతున్నారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. తన తండ్రి రాజీనామా లేఖలు బిజెపి ఎంపి చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని సంజయ్ పేర్కొన్నారు. మా నాన్నకు ప్రాణహాని ఉందని తెలిపారు. తన తండ్రి చుట్టూ ఉన్నవారిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తన తమ్ముడు అరవింద్ పై పోటీ చేస్తానని ధర్మపురి సంజయ్ సవాల్ విసురుతున్నారు. అటు సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపి అర్వింద్ ఫైర్ అయ్యారు.
నిన్నటి చేరిక, నేటి రాజీనామాతో తనకు సంబంధం లేదని తెలిపారు. నా తండ్రి ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనన్నారు. 2018లో కాంగ్రెస్ చేరతానంటే ఎందుకు చేర్చుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపారు. తన తండ్రి ఏ పార్టీలో చేరినా తనకు నష్టం లేదని స్పష్టం చేశారు. అటు డిఎస్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఒత్తిడికి దూరంగా ఉండాలని డిఎస్ కు వైద్యులు సూచించారు. డిఎస్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు.