Monday, December 23, 2024

 నిబద్ధత కలిగిన నేత డిఎస్

- Advertisement -
- Advertisement -

అందరికీ డిఎస్‌గా సుపరిచితుడైన డి. శ్రీనివాస్‌ది నిండైన మనస్సు గల భారీ ఆకారము. ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడటం, లోతైన అవగాహన కలిగి ఎదుటి వారి హృదయాలపై చెరగని ముద్రవేయడం ఆయన ప్రత్యేకత. నిజామాబాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ జి. రాజారాం శిష్యుడిగా రాజకీయాలలో అడుగు పెట్టిన ఆయన ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర వహించారు. రిజర్వ్ బ్యాంక్‌లో కొద్ది రోజుల పాటు ఉద్యోగం చేసిన ఆయన రాజకీయాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకే అంకితమయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇందిరా గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఎన్నికల ప్రచారం లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1989లో రెండవ సారి పిసిసి అధ్యక్షుడైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి అత్యంత నమ్మకమైన నాయకుడు డిఎస్. అప్పుడే మొదటి సారి ఎంఎల్‌ఎగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రథమశ్రేణి నాయకుడిగా ఎదిగారు.

1998లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని పటిష్టం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. తత్ఫలితంగా 2004లో, 2009లో ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. డిఎస్, వైఎస్ జోడీ కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని ఇప్పటికీ అందరూ భావిస్తుంటారు. డిఎస్ రెండు చేతుల్లో రెండు సెల్ ఫోన్లు ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా కూర్చున్న చోటు నుండే నిర్వహించగలరని అప్పటి సిఎం వైయస్‌ఆర్, డిఎస్‌ను ప్రశంసించేవారు. క్రింది స్థాయి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండి, వారు చెప్పేది సావధానంగా విని వారి సమస్యలను పరిష్కరించేవారు. ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ స్థాయి నుండి ఎదిగిన ఆయన ఆర్గనైజేషన్ మెలుకువలు తెలిసినవ్యక్తి. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఆర్గనైజేషన్. డిఎస్, ఎన్‌ఎస్ యుఐలో ఉన్నప్పటి నుండి నాకు సన్నిహిత పరిచయం. ఎం సత్యనారాయణ రావు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్న నన్ను, తాను అధ్యక్షుడు కాగానే సెక్రటరీగా ప్రమోట్ చేశారు.

ఆయన రెండోసారి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు ఆ తరువాత జరిగిన కార్యవర్గ పునర్వవస్థీకరణలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. రాష్ట్రం విడిపోవద్దు అని వాదించే వారితో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో వివరించి చెప్పే వారు. ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము గాంధీ భవన్‌లో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తుంటే అప్పటి సిఎం రోశయ్య, ఎఐసిసి ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఆయన పై వత్తిడి తెచ్చినా, ఆయన సున్నితంగా మమ్మల్ని మందలించే వారు తప్ప మాకు అడ్డు రాలేదు. గాంధీ భవన్‌లో సెప్టెంబర్ 17న జరిగిన హైదరాబాద్ విలీన దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా అప్పటి సిఎం కె. రోశయ్యను ఒప్పించగలిగారు. డిఎస్ అగ్రవర్ణాల నాయకులతో సఖ్యంగా ఉన్నా బిసి పక్షపాతి. బిసి వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడానికి ఎల్లవేళలా కృషి చేశారు.

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు నామినేటెడ్ సభ్యుడిని నియమించేటప్పుడు రోజూ గాంధీ భవన్‌కు వచ్చే సాధారణ సేవాదల్ కార్యకర్త మహమ్మద్ జమీల్‌ను ఎంపిక చేసి పని చేసే కార్యకర్తల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఏ పనికి ఎవరు అర్హులో ఎంపిక చేసుకుని వారిపై పూర్తి బాధ్యతలు పెట్టి పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నడిపేవారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తన కంటూ సుస్థిర స్థానం సంపాదించుకుని, కార్యకర్తలలో మంచి పలుకుబడి ఉన్న డిఎస్‌కు రెండవ సారి ఎమ్‌ఎల్‌సిగా ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఇప్పటికీ నాకు బోధపడలేదు.

ఆయన పార్టీ మారినా, అక్కడ రాజ్యసభ సభ్యుడైనా, తన జీవితం కాంగ్రెస్ కండువాతోనే ముగియాలనే బలమైన కోరిక ఆయనది. ఆయన కోరిక నేడు నెరవేరింది. ఉదయమే సిఎం పిఆర్‌ఒ నాకు ఫోన్ చేసి పిసిసి తరపున చేయవలసిన వాటిని చేయాల్సిందిగా పిసిసి అధ్యక్షులు, సిఎం కోరారని చెప్పడంతో గాంధీ భవన్‌లో సంతాప సూచకంగా పార్టీ పతాకాన్ని అవనతం చేయడం జరిగింది. డిఎస్ భౌతికకాయం నిజామాబాద్‌కు తీసుకు వెళ్లే ముందు డిఎస్ గృహంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కలిసి పార్టీ పక్షాన డిఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా నుంచి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన కోరిక నేడు నెరవేరినది. తెలంగాణ ప్రజలు ఆయనను ఎప్పుడూ మరిచిపోరు.

జి నిరంజన్

సీనియర్ ఉపాధ్యక్షలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News