మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్ చేరనున్నారు. సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం డిఎస్ టిఆర్‌ఎస్ ఎంపిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే డిఎస్ టిఆర్‌ఎస్ ద్వారా దక్కిన ఎంపి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో పిసిసి ఛీఫ్‌గా పనిచేసిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్(డిఎస్) కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సోనియగాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24న సోనియా గాంధీ సమయం ఇవ్వడంతో అదే రోజు డిఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత ఏడాది డిసెంబర్ 16న కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో డిఎస్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ కూడా డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనుమతి ఇచ్చారు.
గతేడాది డిసెంబర్ 17న ఈ విషయమై టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ఎఐసిసి పెద్దలు సమావేశం కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ సమావేశం రద్దైంది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తనను అవమానాలకు గురిచేస్తోందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2015 జులై 8వ తేదీన డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన డిఎస్‌కు తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కెసిఆర్ కట్టబెట్టారు. ఆ తర్వాత రాజ్యసభ పదవిని ఇచ్చారు. రాజ్యసభ దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డిఎస్ రాజీనామా చేశారు. 2018 జూన్ 18న డిఎస్‌కు వ్యతిరేకంగా అదే జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సిఎంను కలిసేందుకు డిఎస్ ప్రయత్నించారు. కానీ సిఎం కెసిఆర్ డిఎస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అప్పటి నుండి డి.శ్రీనివాస్ టిఆర్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే పార్టీతో దూరం పెరిగిన సమయంలో గతంలో ఒక్కసారి మాత్రమే పార్టీ ఎంపిల సమావేశానికి డిఎస్ హాజరయ్యారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా గత ఏడాదిలో డిఎస్ భేటీ అయ్యారు. డిఎస్ బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. డెస్ తనయుడు అర్వింద్ 2019లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపి స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా విజయం సాధించారు. అర్వింద్ విజయం సాధించడం వెనుక డిఎస్ చక్రం తిప్పారనే ప్రచారం కూడా అప్పట్లో నెలకొంది. ఈ ఏడాది జూన్ వరకు డిఎస్ రాజ్యసభ పదవీకాలం ఉంది. అయితే డిఎస్ పార్టీకి దూరం ఉన్న నేపథ్యంలో అదే జిల్లా నుండి మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి టిఆర్‌ఎస్ రాజ్యసభ పదవిని టిఆర్‌ఎస్ కట్టబెట్టింది. చాలా కాలంగా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు డిఎస్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలిశారనే ప్రచారం సాగింది. డిఎస్‌కు సన్నిహితులుగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే డిఎస్ కాంగ్రెస్‌లో చేరడం అప్పట్లో వాయిదా పడింది.
D Srinivas to Join in Congress on Jan 14