Sunday, December 22, 2024

వ్యవస్థల అణచివేత: హేతువాద ఉద్యమం

- Advertisement -
- Advertisement -

వ్యవస్థల మార్పుతో ప్రజా జీవితాల్లో మౌలికమైన మార్పులు రావాలి. కాని బ్రిటీష్ వలస పాలకుల వందల ఏళ్ళ పాలన తర్వాత కూడా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా మనం కులం, మతం, అశాస్త్రీయతలే ప్రధాన భూమిక పోషిస్తుంటే ‘అభివృద్ధికర సమాజాన్ని మనం ఎలా చూడగలం’ ప్రశ్నించిన ప్రతి వారిని నేరస్థులుగా గుర్తించిన ఎమర్జెన్సీ పాలన మనది. అంధ విశ్వాసాలపై నిరసనను ప్రపంచానికి తెలియజేసే ప్రక్రియలో పాల్గొన్నందుకు డా. నరేంద్ర దబోల్కర్‌ను స్వాతంత్య్ర దినానికి కేవలం 5 రోజుల తర్వాత పుణెలో ఆగస్టు 20న హతమార్చిన రోజు. పరిపాలనా వ్యవస్థలు మారుతూ ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఫాసిస్టు పాలన తరహాలో దబోల్కర్, పన్సారీల హత్యలు జరగడాన్ని ప్రజాస్వామిక వ్యవస్థనే ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి.

రాజ్యాంగంలో నిర్దేశించుకున్న సెక్యులర్, లౌకిక రాజ్యం నియమాల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉదాసీనత నేడు ఆ పదాలనే రాజ్యాంగం నుండి తొలగించాలనే దాకా సాగుతున్న హిందుత్వ దాడి ప్రజాస్వామికవాదులను కలవరపెడ్తోంది. ఫెడరల్ విధానాన్ని కుల రహిత, మత రహిత ఆలోచనలు కలిగిన అభ్యుదయ సమాజం ప్రజాస్వామ్య దేశంపై సామ్రాజ్యవాద దేశాల వత్తిడిని ప్రశ్నిస్తున్నందుకే దబోల్కర్, పన్సారీలను హత్యకావించారు. రాజ్యాంగానికి వున్న ప్రామాణికతను గుర్తించే చైతన్యం రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్న రాజకీయ నాయకులకు లేకపోవడం విచారకరం. ఆధిపత్య వర్గాల ద్వారా కొనసాగుతున్న దాడిలో ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం అమలుకావడం లేదు. శాస్త్రీయత కోసం, జీవించే హక్కుపై జరుగుతున్న హిందుత్వ దాడిని ఎదిరించడం కోసం మూఢ విశ్వాసాలను నిర్మూలించడం కోసం నిత్యం యుద్ధం చేసిన డా. దబోల్కర్‌ను ముమ్మాటికి రాజ్యమే హత్య చేసిందని ప్రజలు భావిస్తున్నారు.

నిరాయుధంగా మూఢ విశ్వాసాలను ప్రశ్నిస్తున్న వారిని, విధ్వంసకర అభివృద్ధిని ఎదిరిస్తున్న వారిని, హక్కుల నేతలతో పాటు ప్రజాస్వామిక వాదులందరిపై తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 9న ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. సాయిబాబాను నిర్బంధించి నేటికీ బెయిల్ రాకుండా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ప్రశ్నించే చోట నిత్యం ఎమర్జెన్సీలాగా అప్రజాస్వామిక విధానాలను, అశాస్త్రీయతను, దోపిడీలను నిలదీస్తున్నందుకు ప్రభుత్వ ప్రమేయంతో హత్య చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమి వుంటుంది. సమాజంలో విజ్ఞానంతో పాటు అదే స్థాయిలో భౌతికవాద దార్శనికత పెరగకపోవడంతో అతీత శక్తులపై నమ్మకం, మూఢ విశ్వాసాలు వికృత రూపం దాల్చుతున్నాయి. మతం దాని తాత్విక పునాదిపై ఉండే కులం కేవలం వ్యక్తిగత వ్యవహారానికి మాత్రమే పరిమితం కావాలి.

మతాతీత లౌకిక రాజ్యం, రాజకీయాలు నిజమైన అర్ధంలో ఉనికిలోకి రావాలి. భౌతికవాద దక్పథం గల మేధావులు దబోల్కర్ లాంటి వారి ఆశయాలను ముందు తరాలకు తీసుకెళ్ళడానికి బాధ్యత పడాలి. మూఢ విశ్వాసాల మాటు జరుగుతున్న అమానుష దోపిడీని నిలదీస్తూ ప్రజలమధ్య కార్మికవర్గ శ్రేణుల్లో చైతన్యం నింపుతున్నందుకు డా. దబోల్కర్‌ను హత్య చేయడానికి కూడా సిద్ధమయ్యారు మత ఛాందసవాదులు. నిరాయుధుడైన ఒక ప్రజాస్వామికవాదిని, ప్రజల కోసం కార్యాచరణను నిర్దేశించుకున్న ఒక అభ్యుదయవాదిని హత్య చేయాల్సిన పరిస్థితులను, పునరావృతం కాకుండా ఉండడానికి వాటిపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరపాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి వుంది.

హంతకులను గుర్తించడంలో ఉన్న వెనుకబాటుతనమే నిజంగా వాస్తవమైతే న్యాయ వ్యవస్థ, ప్రజా రక్షణ వ్యవస్థ ప్రజల పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో విఫలం అవుతున్నట్టే గానే మనం భావించాల్సి వుంది. హక్కులను కాపాడలేని ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి ప్రజలకు బాధ్యత వహించే పార్టీలను, రాజకీయ నాయకులను అధికారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యం ప్రధాన కర్తవ్యం. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడలేని ప్రభుత్వాలకు ప్రజలను పరిపాలించే నైతిక హక్కు లేదనేది రాజ్యాంగబద్ధ్దమైన సూత్రం. ప్రపంచంలోని 194 దేశాలకు ఆతిథ్యం ఇచ్చి ఆర్భాటంగా జీవవైవిధ్య సదస్సును నిర్వహించిన మన దేశంలో నోరులేని జీవాలనే కాదు, ప్రజలకు కోసం పరితపిస్తున్న మానవత్వం కలిగిన మనుషులను కూడా జీవించే హక్కు లేకుండా మత ఛాందసవాదులు ప్రయత్నించడం బాధాకరమైన విషయం.

డా. దబోల్కర్ హత్య జరిగిన మరుసటి రోజే పుణెలోని సనాతన్ సంస్థ తన పత్రిక సంపాదకీయంలో దబోల్కర్ హత్య ‘దైవ కార్యం’గా కీర్తించడం ఎంతటి అప్రజాస్వామికమో ప్రపంచానికి తెలియజేయడానికి ప్రజాస్వామికవాదులు తమ గొంతులను విప్పాల్సిన అవసరముంది. డా. దబోల్కర్ ‘మూఢ విశ్వాసాల వ్యతిరేక కమిటీ’ పేరుతో 1989 నుండి ప్రజలను చైతన్యవంతం చేసే ఉద్యమంలో ముందుకు నడుస్తూ వున్నాడు. 1990 రత్నగిరిలో నరేంద్ర మహారాజ్ ఆశ్రమంలో తమ 20,000 మంది భక్తుల ముందు వారికి వ్యతిరేకంగా డా. దబోల్కర్ 15 మందితో కూడిన తన బృందంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో వారి మాయల బూటకత్వాన్ని ఎండగట్టాడు. 2000లో శనిశంగాపూర్ ఆలయాల్లోకి స్త్రీ ప్రవేశ నిరోధాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహించాడు. డా. దబోల్కర్ నిర్వహించిన అన్ని బహిరంగ సభలను, పత్రిక సమావేశాలను హిందూ మత ఛాందసవాదులు నిత్యం ఆటంక పరుస్తూనే వున్నారు.

అజ్ఞానాన్ని తొలగించేందుకు నేను యుద్ధం చేస్తున్నాను. దీనికి నాకు ఆయుధాల సహకారం అవసరం లేదు, నాఆలోచనే చాలు అని భావించి, తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎప్పుడూ పోలీసు వ్యవస్థ సహాయాన్ని కోరలేదు. ప్రజా ఉద్యమాలపై విశ్వాసంతోనే చివరి వరకు తన కార్యాచరణను కొనసాగించాడు. దబోల్కర్ హత్యను ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడానికి రాజ్యం చేసిన దాడిగా గుర్తించాలి. ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా దబోల్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మూఢ విశ్వాసాలతో కూరుకుపోయిన ఈ దేశంలో దానికి వ్యతిరేకంగా కేవలం ఒక ‘ఆలోచన’ వ్యక్తం చేయడం కూడా యుద్ధంతో సమానమని స్వయంగా అసాధారణ పరిస్థితిని దబోల్కర్ చెప్పినాడు.

డా. దబోల్కర్ అధ్యక్షతన 1989లో మహారాష్ర్ట అంధ శ్రద్ధా నిర్మూలన సమితి (%వీచీూ%) స్థాపించబడి 250 శాఖలతో 5000 మంది కార్యకర్తలతో కార్యాచరణలు కొనసాగిస్తూ వుంది. ఈ సంస్థ విస్తృతమవడం హిందూ మత చాందస వాదులకు కంటగింపయ్యి దబోల్కర్‌ను హత్య చేశారని మహారాష్ర్ట ప్రజానీకం భావిస్తున్నారు. 1990 నుండి డా. దబోల్కర్ మూఢ విశ్వాసాల నిర్మూలనా కమిటి ఆధ్వర్యాన ఒక బిల్లును కూడా డ్రాఫ్ట్ చేశారు. ఆ బిల్లే ఆర్డినెన్స్ రూపాలలో డా. దబోల్కర్ హత్యకు గురయిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అసెంబ్లీ ముందుకు వచ్చింది. మహారాష్ర్ట సాంఘిక న్యాయశాఖ మంత్రి శివాజీ రాజ్ మోడే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత యిచ్చారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించి ప్రశ్నించే చైతన్యాన్ని అందించి ఆ వైపుగా సమాజాన్ని ముందు నడిపించే పరిస్థితులకు కల్పించడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.
ఆగస్టు 20 డా. దబోల్కర్‌ను హత్య చేసిన రోజే కాదు, 2007 ఇదే ఆగస్టు 20న వాకపల్లిలో ఆదివాసీ మహిళలు సామూహిక అత్యాచారానికి గురైన రోజు.

16 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత కూడా న్యాయం పొందలేని స్థితిలో విఫలమైన ప్రజాస్వామిక వ్యవస్థను చూసి బాధపడుతున్న రోజు. ఆదివాసీల హత్యాకాండ వాకపల్లి, బల్లుగూడలే కాదు, చత్తీస్‌ఘడ్, కాశ్మీర్, నేడు మణిపూర్‌లో జరుగుతున్న మానవ హననంలో కూడా మణిపూర్ మహిళల జీవితాలు అత్యాచార కాండలో అణచివేతకు గురౌతున్నాయి. వాకపల్లి ఘటనలకు నక్సలిజాన్ని కారణంగా చెబుతూ మణిపూర్‌లో కూకీల అత్యాచార కాండకు మెయితీల జాతి విధ్వంస కాండ కారణంగా చూపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి న్యాయం కోసం పోరాడుతున్న ఆదివాసీ మహిళలు ఏ ఇతర మహిళలపైన రాజ్యం దానితో పాటు ఉన్నటువంటి సాయుధ మూకలన్ని కూడా అత్యాచారాన్ని ఆయుధంగా వాడుతున్నాయి.

ప్రజాస్వామిక వ్యవస్థ మహిళలు గౌరవంగా జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమవుతున్నది. కనీస మానవత్వం లేని ప్రపంచీకరణ మానవ జీవితంలోని ప్రతిపార్శం వ్యాపారీకరించబడడం, మనిషి మనిషిలా కాకుండా ఒక వినియోగదారుల స్థాయికి దిగజార్చడం, బలమైన ప్రచార సాధనమైన టివి ఈ మార్పుకు సహకరించడం. ఇవన్నీ కూడా నిజాయితీపరులను అవినీతిపరులుగా మారుస్తూ, వేగవంతంగా నైతిక విలువలను దిగజార్చేస్తూ, ప్రతి మనిషి వ్యక్తిగత జీవితాన్ని ఊహించని దిగువ స్థాయికి నెట్టివేస్తూ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయి. ప్రజాస్వామీకరణ ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన యువత, భవిష్యత్తు లక్ష్యం పట్ల సరియమైన అవగాహన లేకుండా అచేతనంగా మారుతున్నారు. శాస్త్రీయ భావజాలం, చట్టాల అమలులో పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై పోరాడుతున్న ప్రజాస్వామ్యవాదులపై రాజ్యం చేస్తున్న దుర్మార్గ దాడిని ఎదిరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి కలిసి రావాల్సిందిగా దబోల్కర్, పన్సారేల స్ఫూర్తితో పిలుపునిస్తున్నాం.

నారాయణ రావు
(సహాయ కార్యదర్శి పౌరహక్కుల సంఘం)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News