ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారానికి ఆమె ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చారిత్రక మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తరుణంలోనే ఫాల్కే అవార్డుకు ప్రముఖ నటి వహిదా రెహమాన్ ఎంపిక కావడం గర్వకారణమని ఒక ట్వీట్‌లో మంత్రి అభినందనలు తెలియజేశారు.
వహీదా రెహమాన్ 1955లో తెరకెక్కిన తెలుగు చిత్రం ‘రోజులు మారాయి’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలోని ‘ఏరువాక సాగారో రన్నో…’ పాట ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం 1956 సంవత్సరంలో వచ్చిన సీఐడీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఆమె అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో ఆమె ప్యాసా, కాగజ్ కా ఫూల్, చౌద్వి కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి వంటి పలు హిట్ సినిమాలు చేశారు. ఐదు దశాబ్దాల నట చరిత్రలో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. ఐదు దశాబ్దాల కాలంలో ఆమె దాదాపు 90కి పైగా సినిమాల్లో నటించారు. 1971లో ఉత్తమ నటిగా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. ‘’నారీ శక్తి వందన్’ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరుణంలోనే వహీదా రెహమాన్‌కు జీవిత సాఫల్య పురస్కారం రావడం అందరూ గర్వించదగిన విషయం.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పేరుప్రతిష్టలు తెచ్చిన వారిలో ఒకరైన వహిదా రెహమాన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను” అని అనురాగ్ ఠాకూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వహీదా రెహమాన్ మాట్లాడుతూ “నా నటనకు మరొక గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ అవార్డును నా తోటి నటీనటులు, సినీ రంగంలోని అందరికీ అంకితం చేయాలనుకుంటున్నా”అని అన్నారు. ఇక వహిదా రెహమాన్‌కు ఈ ఏడాది చివరలో ’దాదాసాహెబ్ ఫాల్కే’ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.