Thursday, December 19, 2024

దివ్యాంగురాలైన కూతురు కోసం రోబో తయారు చేసిన కూలీ

- Advertisement -
- Advertisement -

దివ్యాంగురాలైన కుమార్తె కోసం రోబో తయారు చేసిన కూలీ
మరికొన్ని రోబోల తయారీకి సంసిద్ధత
గోవా స్టేట్ ఇన్నొవేషన్ కౌన్సిల్ ఆర్థిక చేయూత

పనాజి(గోవా): ఒకపక్క భార్య మంచం పట్టింది.. మరోవైపు ఎలాంటి చలనం లేని వికలాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతోపాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది. 12 గంటలపాటు అదేపనిగా కూలి పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇది గోవాలోని పోండా తాలూకా బెదోరా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ బిపిన్ కదమ్ దీనగాధ. రెండేళ్ల కిందట కదమ్ భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో దివ్యాంగురాలైన తన కుమార్తెకు కనీసం అన్నమైనా తినిపించలేక పోతున్నానని బాధపడుతుండేది. కదమ్ తన కూలిపని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత కుమార్తెకు అన్నం తినిపించేవాడు. అంతవరకు ఆమెకు అన్నం తినిపించడం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో భార్య బాధను భరించలేక పోయాడు. ఏదో ఒకటి చేయాలనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తన కుమార్తె ఎవరిపైనా ఆధారపడకుండా ఆమెకు ఆహారం తినిపించే రోబో కోసం అన్వేషించాడు. అయితే ఎక్కడా అలాంటి రోబో లేదని తెలుసుకున్నాడు. తానే సొంతంగా రోబో వంటిది తయారు చేయాలని సంకల్పించాడు. రోజూ 12 గంటల పాటు పనులు చేసుకుని మిగతా సమయాన్ని రోబో తయారీ కోసం వినియోగించాడు. నాలుగు నెలల పాటు ఆన్‌లైన్ ద్వారా రోబో తయారీ, సాంకేతిక ప్రక్రియ గురించి తెలుసుకుని చివరకు వాయిస్ కమాండ్ ద్వారా ఆహారం తినిపించే “మా రోబోట్ ” ను తయారు చేయగలిగాడు.

ఈ రోబో తయారై సహాయం చేస్తున్న తరువాత తన కుమార్తె కళ్లల్లో ఆనందం చూడగలిగానని కదమ్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్భర్ నినాదంతో ఉత్తేజపరుస్తుంటారు. అదే విధంగా ఎవరిమీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్ ద్వారా తన కుమార్తె ఉండాలని తన ఆకాంక్షగా కదమ్ పేర్కొన్నాడు. మరికొంతమంది ఇలాంటి పిల్లల కోసం రోబోలు తయారు చేస్తానని ఈ రోబోను విశ్వవ్యాప్తం చేస్తానని కదమ్ స్పష్టం చేశాడు. ఇ వాయిస్ కమాండ్ ద్వారా ఏ ఆహారం కావాలో చెబితే ఆ ప్రకారం అన్నం, కూర కలపడం, తినిపించడం అన్నీ ఈ రోబో చేస్తుంది. ఈ రోబో గురించి గోవా స్టేట్ ఇన్నొవేషన్ కౌన్సిల్ తెలుసుకుని బిపిన్ కదమ్‌ను అభినందించింది. వాణిజ్యపరంగా ఇలాంటి రోబోలు తయారు చేసేందుకు కదమ్‌కు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది. కదమ్ కుమార్తె వంటి దివ్యాంగులైన వారెందరికో ఈ “తల్లిరోబో (మా రోబోట్ ) ఉపయోగపడుతుందని ఆ సంస్థకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్ సుదీప్ ఫల్దేశాయ్ తెలిపారు. మార్కెట్లోకి విడుదల చేయబోయే రోబో ధర ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు.

Daily Wage Worker build robot feed to his daughter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News