భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామాకు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. పివి ఫౌండేషన్ అధ్యక్షులు, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఛైర్మన్ మణీందర్ జీత్ సింగ్ బిట్టా, పివి మనుమడు పివిఆర్ కశ్యప్, హైదరాబాద్‌కు చెందిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్, సిఎస్‌బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, పివి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివంగత పివి స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. శాంతి ద్వారానే ప్రపంచం మనుగడ సాగించగలదని దలైలామా పేర్కొన్నారు. భారతరత్న పివి ప్రపంచశాంతి కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పివి అడుగుజాడలలో నడవాల్సిన అవసరం వుందని బిట్టా, బాలలత మలిలవరపు ఆ సందర్భంగా అన్నారు. పివి మెమోరియల్ ఈ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమంకు, రతన్ టాటాకు అందజేసింది. మూడవసారి దలైలామాకు ఇచ్చామని పివిఆర్ కశ్యప్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు.