శ్వేతపత్రం విడుదల చేసిన చైనా
బీజింగ్: దలైలామా వారసుడిని తామే గుర్తిస్తామని, ఆ అధికారం ప్రస్తుత దలైలామా లేదా ఆయన అనుచరులకుంటుందన్న ప్రతిపాదనను ఆమోదించమని చైనా తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక శ్వేతపత్రాన్ని ‘1951 నుంచి టిబెట్, విముక్తి, అభివృద్ధి, సంపద’ పేరుతో శుక్రవారం విడుదల చేసింది. బౌద్ధమత పెద్దలు జీవించి ఉండగానే, వారి వారసుల్ని నిర్ణయించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. చైనాను ఖింగ్ రాజవంశం పాలించిన కాలం(1644-1911)లోనూ కేంద్ర ప్రభుత్వమే దలైలామా వారసుల్ని నిర్ణయించిందని శ్వేతపత్రం పేర్కొన్నది. ప్రాచీన కాలం నుంచే చైనాలో టిబెట్ అంతర్భాగమని తెలిపింది.
ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న 14వ దలైలామాకు 85 ఏళ్లు. దాంతో, ఆయన బతికి ఉండగానే వారసుడిని ప్రకటించాల్సి ఉన్నది. టిబెట్ స్వాతంత్య్రాన్ని కాంక్షించిన దలైలామా 1959 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. టిబెట్‌పై అమెరికా ఇటీవల ప్రకటించిన విధాన పత్రంలో దలైలామా వారసుడిని ప్రస్తుత దలైలామా, టిబెట్ బౌద్ధ నేతలు, టిబెట్ ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. దాంతో విభేదించిన చైనా తన వైఖరిని వెల్లడించింది.