ఆశ, నిరాశల మద్య దళిత యువకులు
నమ్మబలుకుతున్న నాయకులు
మన తెలంగాణ/బోనకల్: కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితుల జీవితాలలో ఆర్దిక వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన దళిత బందు పధకం ఎన్నికల కోడ్ కూయటంతో అటు ప్రభుత్వాన్ని ఇటు దళితులను ఆయోమయానికి గురిచేసింది. ఎన్నికల కోడ్ కొద్ది రోజులలో వస్తుందనగా దళిత బంద్ పధకం లబ్దిదారుల ఎంపిక ఆర్భాటంగా అధికారులు చేపట్టారు. అంతేకాకుండా సత్తుపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు ప్రత్యేక చొరవతో బోనకల్ మండలంలోని అర్హులైన ప్రతి దళితునికి దళిత బందు అందజేస్తామని ప్రకటించారు.
దీంతో మండలంలో అలజడి ప్రారంభమైంది. దీనిని విసృతంగా ప్రచారం చేసుకొనేందుకు కమలరాజు మండలంలోని ప్రతి ఎస్సీ కాలనీకి ప్రత్యేకంగా వెళ్లి ప్రతి దళిత కుటంబాని కలిసి పధకం అందరికి వస్తుందని ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేసి ఆదివారం శెలవు దినంలో సైతం పనిచేయించి దళితులు అందజేయవలసిన పత్రాలను తయారుచేయంటం విశేషం.
ప్రభుత్వం చేతిలో ఉంది ఏది ఏమైనా అందరికి బందు అందిస్తామని ధీమాగా హామీ ఇచ్చిన కమలరాజు ఎన్నికల కోడ్ నిబందనలతో పధకం పనులు నిలిచిపోవటంతో ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా సీఎల్పీ లీడర్ మధిర శాసనసభ్యులు మల్లు భట్టీవిక్రమార్క సైతం బోనకల్ మండలంలో దళిత బంద్ అమలు విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొన్నారు. అందరికి బందు వస్తుందని దళారుల మాటలు నమ్మవద్దని ప్రకటనలు చేశారు. దీంతో ఇద్దరు నేతల మద్య దళిత బంద్ ప్రతిష్టాత్మకంగా మారింది. దళిత బంద్ వస్తే ఏమి జరిగేదో కాని అది పూర్తిగా నిలిచిపోవటంతో ఇప్పుడు రెండు వర్గాలకు అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గ్రామాలలోని దళిత వాడలలో దళిత బందు వస్తుందా, రాదా ? అని విషయం తీవ్ర జర్చనీయాశంగా మారింది.
కాని అధికారులు దళిత బంద్ పనులను పూర్తిగా నిలిపివేసి ఎన్నికల నియమాళి ప్రకారం పనులు చేసుకొంటుండంతో అనేక మంది అమాయకులైన దళితులు తమకు అధిక మొత్తంలో అందే ఆర్దిక సాయం తృటిలో తప్పిపోయిందని నిరాశ, ఆందోనకు లోనయ్యారు. ఆళ్ళపాడుకు చెందిన ఏల్పుల ఎల్సిన్ అనే యువకుడు తనకు ఆర్దికం సాయం అందితే వెంటనే టాటా ఏసీ వాహనం కొనుగోలు చేసికొత్త జీవితం ప్రారంబించాలని తలపోశాడు. ప్రస్తుతం నిలిచిపోయిన దళిత బందుతో ఎల్సిన్ తీవ్ర ఆందోనకు గురయ్యాడు. ఇదే పరిస్తితి అనేక మంది దళిత యువకులలో కనిపిస్తొంది. ప్రస్తుతం నాయకులు, పార్టీలు పరిస్తితులు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవటంతో దళిత బందును ఆశగా చూపించి తమ ఓట్లకు గాలం వేశారా అనే సందిగ్దంలో దళిత యువకులు ఉన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలలో నియోజకవర్గంలో దళిత బందు ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందని అధిక శాతంగాఉన్న దళిత ఓటు బ్యాంకును రెండుప్రధాన పార్టీలు టార్గెట్‌గా చేసుకొన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.