ఇసి ఆదేశాలు చిన్న అడ్డంకి మాత్రమే
ఉప ఎన్నిక తర్వాత పథకం అమలును ఆపేదెవరు?: నవంబర్ 4 నుంచి నేనే స్వయంగా పథకం అమలును పర్యవేక్షిస్తా : యాదాద్రిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తాత్కాలికంగా దళితబంధు అమలుకు ఆటంకం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు చిన్న అడ్డంకి మాత్రమేనని సిఎం పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రిలో ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సిఎం కెసిఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలును నిలిపివేయాలన్న ఇసి ఆదేశాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సిఎం కెసిఆర్ సమాధానం ఇచ్చారు. ఉప ఎన్నిక తర్వాత యథావిధిగా దళితబంధు పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ బై పోల్ ముగిసి నవంబర్ 2న ఫలితాలు వెలువడిన తర్వాత దళితబంధు అమలును ఆపేదెవరని ప్రశ్నించారు. నవంబర్ 4 నుంచి స్వయంగా తానే దళిత బంధు పథకాన్ని పర్యవేక్షిస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగానూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దళితులను ఆర్థికంగా పటిష్టంగా తయారు చేయటమే తన లక్ష్యమని సిఎం కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలకు దళితబంధు పథకానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.