హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకానికి 2023 24 ఆర్థిక సంవత్సరంలో రూ., 17,700 కోట్లు ప్రవేశ పెట్టారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభత్వుం దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు కేటాయించింది. అణగారిన, దళిత జాతి సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని 2021లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్యాంకు లింకేజీ లేకుండా దళిత కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తోంది.
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 1500 కుటుంబాలకు ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దళితజాతి స్వశక్తితో, స్వాలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని రూపొందించారు. దళిత బంధు సహాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే గాకుండా ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతోంది. దళితులు వ్యాపార రంగంలో ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోంది.