Monday, December 23, 2024

దళిత ఆత్మగౌరవ పతాక!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కెసిఆర్ ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాగు, తాగు నీటి సమస్యను తీర్చేందుకు తీసుకొచ్చిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అయింది. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ క్రమంలోనే… తీసుకొచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దళిత బంధు విప్లవాత్మకమైనది. దళిత బంధు పథకం రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా కెసిఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అర్హుడైన ప్రతి దళితునికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయటానికి నిర్ణయించింది.

KCR is a Political Power

సామాజిక అభివృద్ధికి ప్రజల జీవన ప్రమాణాలు ప్రామాణికం. సంక్షేమ పాలనలో అందే పథకాలతో ప్రజల జీవితాల్లో సమూల మార్పుకు నాంది పడకపోతే.. అట్టి పథకాలు ప్రజాకర్శక పథకాలుగానే మిగిలిపోతాయి తప్ప, వాటితో సామాజికంగా ఒనగూడేదేమీ ఉండదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో సమూల విప్లవాత్మక మార్పు సంభవించినప్పుడే… సమాజంలో నిజమైన మార్పుకు నాంది పడుతుంది. అట్టి పథకాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకాన్ని గురించి చెప్పుకోవాలి.

స్వాతంత్య్రానంతరం ఈ 75 ఏండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశాయి. వాటితో ప్రజల కష్టాలన్నీ దూరమవుతాయని చెప్పుకొచ్చాయి. కానీ వాటితో పాలక ప్రభుత్వాలు చెప్పిన ఏ లక్ష్యం నెరవేరలేదు. ప్రజల జీవితాలు బాగుపడలేదు. ఐదేండ్ల తర్వాత చూస్తే… ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ప్రజల జీవితాలు కునారిల్లిపోయాయి. ఇలాంటి పేరు గొప్ప, ఊరు దిబ్బ పథకాలను ఎన్నింటినైనా చెప్పుకోవచ్చు.

గతంలో ఇంటింటికీ పాడి బర్రె, పాడి ఆవు పథకం అమలు చేశారు. ఈ బర్రె గొర్రె పథకంతో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదుగుతారనీ అన్నారు. ఆ స్వయం సమృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. కానీ పాడి ఆవు, బర్రెలు మేత మేయటానికి గుంటభూమి లేని దళిత, వెనుకబడిన కులాల ప్రజలు వాటిని పోషించలేని దుస్థితి ఏర్పడింది. దాంతో పాడి బర్రె పథకం నీరుగారిపోయింది. ఇకపోతే… ఇండ్లులేని నిరుపేదలకు సురక్షితమైన భద్రమైన జీవితం కోసం ఆవాస ఇండ్లు కట్టిస్తామన్నారు. ఆ పేరుతో కట్టించిన ఇండ్లు మనుషులు నివసించ వీలులేని స్థితిలో ఉండి అవన్నీ నిరుపుయోగ వృధా చిహ్నాలుగా మిగిలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇన్నాళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ.. రాజకీయ పార్టీల తాత్కాలిక ప్రయోజనం కోసం, ఓట్ల కోసం వచ్చినవి మాత్రమే. అందుకే… ప్రజల ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల జీవితాల్లో మార్పు లేదు.

కానీ… తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కెసిఆర్ ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాగు, తాగు నీటి సమస్యను తీర్చేందుకు తీసుకొచ్చిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అయింది. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ క్రమంలోనే… తీసుకొచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దళిత బంధు విప్లవాత్మకమైనది. దళిత బంధు పథకం రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా కెసిఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అర్హుడైన ప్రతి దళితునికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయటానికి నిర్ణయించింది. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు, జమానత్ అవసరం లేదు. ఆ సాయంతో వారు తమకు నచ్చిన, ఇష్టమైన రంగంలో ఆ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందటం ద్వారా ఆత్మగౌరవంతో జీవించేలా మార్గం చూపుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు దఫాలుగా దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ జీవితం దళిత బంధు పథకంతో సంపూర్ణంగా మారిపోయింది. తల్లిదండ్రుల అకాల మరణంతో రాజ్‌కుమార్ డిగ్రీ చదువు మధ్యలో ఆపేసీ చెల్లీ, ఐదుగురు తమ్ముండ్ల పోషణ కోసం దినకూలీగా మారాడు. పని దొరకని రోజుల్లో ఇంటి దగ్గరే కుట్టుమిషన్‌తో బట్టలు కుట్టి బతుకుతున్నాడు. చెల్లెలి పెండ్లి చేయటం కోసం తాను పెండ్లి చేసుకొని జీవనం సాగిస్తున్న సమయంలో… ఒక రోజు బట్టలు కుడుతుంటే.. ఫోన్ వచ్చింది. దళిత బంధు పథకం మంజూరైందనీ, రేపు వచ్చి పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న పది లక్షల రూపాయల డబ్బు తీసుకోవాలని ఫోన్‌లో సమాచారం. అంతే.. తెల్లారే సరికి ఆయన అకౌంటులో రూ. 10 లక్షలు పడ్డట్లు.. మెస్సేజ్..! దాంతో రాజ్‌కుమార్ జీవితమే మారిపోయింది. మంచి కుట్టు మిషిన్లు తెచ్చి బట్టలు కుట్టే టైలరింగ్ షాపును ఆధునిక హంగులతో తీర్చిదిద్దాడు. ఒకప్పుడు ఆ పూటకు గడవటమే కష్టంగా ఉండి అర్ధాకలితో అలమటించిన కుటుంబం ఇవ్వాళ.. స్వయం శక్తితో సమృద్ధిగా ఎదిగి ఆత్మగౌరవంతో బతుకుతున్నది.

కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్ గ్రామంలో లింగంపల్లి శ్రీహరి దళిత బంధు పథకంతో ఆధునిక సాంకేతికత కలిగిన శక్తివంతమైన ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఒకప్పుడు ఎవరు కూలికి పిలుస్తారా అని నడిబాజార్ల నిలబడి దిక్కులు చూసిన శ్రీహరి ఇవ్వాళ తన ట్రాక్టర్ మీద ఉపాధి పొందుతున్నాడు. తాను ఉపాధి పొందటమే కాక, మరో పది మందికి కూలి పని ఇస్తూ.. ఉపాధి కల్పిస్తున్నాడు. ఇదే గ్రామంలో లింగంపల్లి నారాయణ దళిత బంధు పథకం కింద వచ్చిన పది లక్షల రూపాయలతో చెప్పుల దుకాణం నెలకొల్పాడు. గతంలో కాలికి చెప్పులు లేకుండా తిరిగి కూలినాలి చేసుకొని బతికిన నారాయణ ఇవ్వాళ చెప్పుల దుకాణంతో జీవన భద్రత పొందుతున్నాడు.

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంబర్‌పల్లికి చెందిన శాగ పెంటయ్య దళిత బంధు పథకంతో కోళ్ల ఫారం నెలకొల్పాడు. అంతకు ముందు దినకూలీగా పని చేస్తూ.. రోజూ పని దొరకని స్థితిలో ఆకలిదప్పులతో అలమటించింది అతని కుటుంబం. పిల్లల ఆకలిని తీర్చి బడికి పంపటం కూడా వీలుపడని దుస్థితి పెంటయ్యది. ఇప్పుడు కోళ్లఫారం పెట్టి తాను పని చేస్తూ.. మరో ఇద్దరికి పని కల్పిస్తున్నాడు. అనుక్షణం కోళ్ల ఫారంలోనే ఉంటూ.. వాటి ఆలనాపాలనా చూస్తూ కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు. ఆ క్రమంలో ఎదిగిన కోళ్లను మార్కెట్‌కు తరలించి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ రోజు శాగ పెంటయ్య.. ఆ చుట్టుముట్టు గ్రామాల్లో వ్యక్తిగత అభివృద్ధి, వికాసానీకి ప్రతీక.

మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన తగరం చిరంజీవి ఆ ప్రాంతంలో ఆత్మగౌరవ ప్రతీక. దళితబంధు పథకం లేక ముందు చేయటానికి పని లేక నిరుద్యోగిగా ఆయన ఎదుర్కొన్న అవమానాలు, చీత్కరింపులు అన్నీ ఇన్నీ కావు. తన వ్యక్తగత జీవితమే కాకుండా.., కుటుంబం కూడా అనేక సమస్యలను ఎదుర్కొన్నది. సమస్యల సుడిగుండంలో సతమతమవుతున్న పరిస్థితుల్లో కారుచీకటిలో కాంతిరేఖలా దళిత బంధు పథకం వచ్చి చిరంజీవి జీవితంలో వెలుగులు నింపింది. దళితబంధు పథకంతో వచ్చిన రూ.10 లక్షలతో ఓ కారు కొని కిరాయికి నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇవ్వాళ… కారును నడుపుతూ.. ఆపదలో, అక్కరలో చిరంజీవి అందరికీ ఆప్తుడయ్యాడు. పది మందికి అక్కరలో ఆదుకునే వాడుగా ఎదిగి, కారు కిరాయిగా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తానూ… పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుతో మారిన జీవితాలు ఎన్నో. ఒక్కొక్కరిది ఓ విజయగాథ, ఓ బతుకు కథ. తరతరాలుగా సమాజంలో అట్టడుగున అలమటిస్తూ దుఃఖించిన దళితులు దళిత బంధు పథకం ద్వారా అందిన సాయంతో తమ బతుకులను తీర్చి దిద్దుకుంటున్నారు.అన్ని రకాలుగా ఆర్థికంగా, సాంస్కృతికంగా ఉన్నతీకరించుకుంటున్నారు. దళిత బంధు పథకం ద్వారా స్వయం ఉపాధి పొందిన, పొందుతున్న కుటుంబాల ఆర్థిక, సామాజిక జీవనంలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరిగిన జీవన ప్రమాణాల కారణంగా.. ఇవ్వాళ దళితులు… ఆత్మగౌరవ ప్రతీకలుగా తమ అభివృద్ధి వికాసాలతో మొత్తం సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవ్వాళ… దళిత బంధు అంటే… దళిత అభివృద్ధి, ఆత్మగౌరవ పతాక.

గ్యాదరి బాలమల్లు
(టిఎస్‌ఐఐసి చైర్మన్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News