నాగర్‌కర్నూల్: అర్హులైన వారందరికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌కు డిహెచ్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మిపతి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల నుంచి బారాస ప్రభుత్వం దళితులకు అనేక హామీలు ఇచ్చి మరిచిందన్నారు.
ప్రభుత్వ పథకాలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు అందకుండా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు అందుతున్నాయని వారు వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దళిత బంధు పథకం అర్హులైన వారికి ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అవుట వెంకటస్వామి, మారేడు శివ శంకర్, బండి శ్రీను, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.