Monday, November 25, 2024

దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన యుపి పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: గ్రేటర్ నోయిడాలో పోలీసులు తనను తప్పుడు కేసులో ఇరికించి చిత్రహింసలు పెట్టారని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక 22 ఏళ్ల దళిత విద్యార్థి ఆరోపించాడు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాకు చెందిన సెక్టార్ బేటా 2 పోలీసు స్టేషన్‌లోలో పోలీసులు తన చేత బలవంతంగా మూత్రం తాగించారని, తనను చిత్రహింసలు పెట్టారని ఎల్‌ఎల్‌బి రెండవ సంవత్సరం చదువుతున్న ఆ దళిత విద్యార్థి ఆరోపించాడు. బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసులు పెట్టి గత ఏడాది తనను జైలుపాలు చేశారని ఆ విద్యార్థి ఆరోపించాడు.

ఆ విద్యార్థి పోలీసులపై చేసిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని గురించి గ్రేటర్ నోయిడా అదనపు పోలీసు డిప్యుటీ కమిషనర్ అశోక్ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించినపుడు ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు.

2021 జూన్‌లో నోయిడాలోని సెక్టార్ 49 పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక మసాజ్ సెంటర్ నుంచి నడుపుతున్న సెక్స్ రాకెట్ గురించి తాను పోలీసులకు సమాచారం అందించానని, పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి జైలుకు పంపారని ఆ విద్యార్థి తెలిపాడు. ఆ మహిళ, ఆమె భర్త తాను బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసు పెటారని ఆ విద్యార్థి తెలిపాడు. గత ఏడాది నవంబర్ 18న పోలీసులు తనను గ్రేటర్ నోయిడాలోని ఎన్‌ఎన్‌జి ప్లాజా వెలుపల అదుపులోకి తీసుకుని బేటా 2 పోలీసు స్టేషన్‌లో అత్యంత దారుణంగా కొట్టారని అలీగఢ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థి ఆరోపించాడు.

పోలీసు స్టేసన్‌లోని పై అంతస్తులోని ఒక గదిలో తనను బంధించి రక్తంకారేటట్లు కొట్టారని, తనకు ఫిస్టులా ఆపరేషన్ జరిగిందని వేడుకున్నానని అతను చెప్పాడు. మంచినీళ్లు కావాలని అడిగితే బాత్‌రూములోని ఒక కుండలో మూత్రం పోసి తన చేత బలవంతంగా తాగించారని ఆ విద్యార్థి ఆరోపించాడు. తనను మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రికార్డుల్లో మాత్రం సాయంత్రం 5.30 గంటలని రాశారని అతను తెలిపాడు.

రెండు వారాలు జైలులో గడిపిన ఆ విద్యార్థి బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి తనపై నమోదైన తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ అతను న్యాయస్థానంలో పోరాడుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News