స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో కులమత విభేదాలు సమసిపోలేదు. తమది అగ్రకులమనీ, ఎదుటివారిది నిమ్నకులమనీ దూషించడం, అవమానించడం దేశంలో ఏదో ఓ మూల రోజూ జరుగుతున్న తతంగమే. గుజరాత్ లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
చడసాన గ్రామంలో వికాస్ చావ్డా అనే పెళ్లి కొడుకు వధువు ఇంటికి గుర్రంపై ఊరేగింపుగా వెళ్తున్నాడు. అతని వెంట వందమందికి పైగా బంధుమిత్రులుకూడా ఉన్నారు. అంతలో మోటర్ సైకిల్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆగి, గుర్రంపై ఉన్న పెళ్లి కొడుకుని కిందకు లాగి పడేశాడు. పెళ్లి కొడుకు దళితుడు కావడమే అందుకు కారణం. గుర్రంపై ఊరేగే హక్కు తమ కులానికి చెందినవారికే ఉంటుందని చెబుతూ నానా దుర్భాషలూ ఆడాడు. మరో ముగ్గురు అగ్ర కులస్థులు అతనికి తోడయ్యారు. అందరూ కలసి పెళ్లికొడుకునూ, అతని కులాన్నీ తూలనాడుతూ అవమానించారు. దీనిపై పెళ్లి కొడుకు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.