‘The history I read in school was not mine, but I was made to believe that it was mine, too. The authors that I read in school and colleges were not my people. They did not write about my people, and if they did, they did with a gage. I was orphaned from history and forced to adopt someone else’s as mine‘ Siddhesh Gautham (Author & Ambedkarite)
కాలం గురించి ఇతరేతర వాదాలు వేటిలోంచో కాకుండా జీవితానుభవం నుండి మాత్రమే మాట్లాడుకుంటే, కాలానికి మనం దేన్ని అనుసంధానం చేస్తామో దాన్నే కాలం తిరిగి మనకు ప్రతిఫలంగా ఇస్తుంది. చరిత్ర కూడా అంతే. ఏ వర్గాలు కలం పట్టుకు రాస్తూకూర్చుంటే వాళ్ల చరిత్రే మానవాళిపై సాక్షరతగా ప్రకాశమానం కాగలదు. మనకు తెలుసు, మెజారిటీ నిరక్షర సమాజాలు నిశీధిలోనే ఉండిపోయిన దాఖలాలెన్నో చరిత్రలో. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘దాచేస్తే దాగని సత్యం మూలుగుచున్నది చరిత్రలో’. కొత్త ఆలోచనలే లేకపోతే కొత్త ఆవిష్కరణలు లేవు.
కొత్త ఆచరణ లేకపోతే కొత్త సామాజికతా లేదు. చరిత్ర ప్రభావం కాలం ప్రభావం అమోఘమైనవి, ప్రవాహశీలమైనవి. బూర్జువాలు ఎంత తప్పించుకున్నా ఎక్కడో ఒకచోట కాలానికి చరిత్ర కూ దొరికిపోతారు. అట్లాగే కాలమూ, చరిత్రా కుతంత్రాల్లో ఎంతగా కూరుకుపోయినా భూమి మూలాల్ని తొలుచుకొని మొలిచి వీచే సమ తా చైతన్యాలకు ఆధారాలతో పట్టుబడతాయి. కాలం అంటే గడియారంలో అంకెల మధ్య తిరిగే ముల్లు కానే కాదు, కాలం అంటే బతికిన మనుషులు, బతుకుతున్న మనుషులు, బతకవలసిన మనుషులు. చరిత్ర అంటే పుస్తకంలో శాసనాధారాలతో తిప్పే పేజీలు మాత్రమే కాదు.గతం తాలూకు రక్తాశ్రువులు, ఆలోచనలు, ఆచరణలు, అవిశ్రాంత ఆరాట పోరాటాలు, జయాపజయాలు. మహాకవి దాశరథి చెప్పిట్టు ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో’. ఎంత వాస్తవిక గంభీర సంవేదన ఇది. నిజమే, కాలం మీద చరిత్ర నడచింది, నడచిన నరహంతల చరిత్రతో కాలం సద్దుమణిగి సహకరించింది, కొంత సంఘర్షించింది.
ఆ సంఘర్షణనే దాచిన బడబానలమని, అసువులు బాసిన త్యాగధనులనే కానరాని భాస్కరులని దాశరథి అన్నది. మరి, ఇప్పుడు కాలం, చరిత్రా ఆ బడబానలాన్ని, ఆ భాస్కరులను గుర్తించి చర్చించి ఆగామి కాలాలకు, చరిత్రకు అందించవలసి కర్తవ్యం వైపుకు కొత్తతరాన్ని ఉద్యుక్తం చేస్తున్నాయి. ఇందుకు దాశరథి చెప్పిన అజ్ఞాత సూరీళ్ల, అనంత సంఘర్షణల ప్రచోదనార్థం అణగారిన వర్గాలు ఈ ఏప్రిల్ నెలను ఆకరం చేసుకున్నారు. దళిత చరిత్ర మాసం(Dalit History Month)గా సంబోధిస్తున్నారు. ప్రతి యేటా ఈ ఏప్రిల్ 30 రోజులు బహుజన స్పృహను సంఘటిత శక్తిని పెద్ద యెత్తున చాటేందుకు భిన్నరూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు.
దళిత చరిత్ర మాస భావనా పరీవ్యాప్తిలో ఇప్పుడు దేశంలోని అడుగుభుజపు గద్గద స్వరాల ఉమ్మడి సంకల్పం (Common Will) ఒక్కటే. అదేమిటంటే, చరిత్రను తిరగ రాయడం, కాలాన్ని తిరగేసి తమ పూర్వీకుల వీరగాథలను ఆలాపించడం. ప్రాకృతికంగా ఏప్రిల్ ను పూలమాసం, కొత్త చివుర్లమాసం, నిండు వసంతం (ఫుల్ స్ప్రింగ్) అని పిలుస్తుంటాం. ఏప్రిల్ పూసే పూలను మహాత్మా ఫూలే సిద్ధాంతంతో, చిగిర్చే చివుర్లను అంబేద్కరిస్టు చింతనతో అన్వయించి మాట్లాడుకునే సద్య స్ఫూర్తిలోకి అట్టడుగు వర్గాలు చేరుకున్నందుకు కాలం చరిత్రా ఒకింత గర్వపడాల్సిన సందర్భమే. కొత్త తరం ఎవరు? కొత్త తరం ఏం చేయాలి? అనే ప్రశ్న మనలో ఎవరికైనా తలెత్తినప్పుడు ‘వ్యవస్థలో సమూల పరివర్తన (రాడికల్ ట్రాన్సఫర్మేషన్) కొరకు సునిశిత జోక్యం లేదా మధ్యవర్తిత్వం (క్రిటికల్ ఇంటర్వెన్షన్) నెరపగల భావుకులు, ఆచరణ శీలతే కొత్తతరం దాని కార్యాచరణ’ అంటారు సుప్రసిద్ధ రచయిత్రి మీనా కందసామి. మనం ప్రస్తుతం స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో ఉన్నాం. ఔను, రాజకీయ పండితులు నుతిస్తున్నట్టు ప్రజాస్వామ్యం మన దేశానికి పెద్ద సంపదే.
దీన్ని మనం ఎల్లెడలా సంరక్షించుకోవాల్సిందే. అయితే, రాజకీయ ప్రజాస్వామ్యానికే తప్ప మనం సామాజిక ప్రజాస్వామ్యానికి చేరువ కాలేకపోయాం. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగ పరిషత్తులో ‘We must make our political democracy a social democracy as well. Political democracy cannot last unless there lies as the base of it social democracy’ అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. మరి, ఆ మహాశయుడు స్వప్నించిన సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎందుకు నిర్మించుకోలేకపోయాం? అంటే, మనకు అందుబాటులో ఉన్న గతకాలపు చరిత్ర, సాహిత్యం, కళలు కులీనులకు సంబంధించిన కావటాన, పురోహిత సంప్రదాయంలో వాటినే ముమ్మారు వింటూ ఆనందిస్తూ మన మూలవాసుల మహనీయుల కథలను గాథలను పూర్తిగా విస్మరించడంవల్ల. బడుగుల మహిమాన్వితమైన స్వీయ చరిత్ర విస్మరణ ఘోర తప్పిదమే కాదు, పెద్ద నేరం కూడా. విస్మరణ ఘాతుకం ఊరు వాడల గుండా, ఉత్పత్తి సేవా కులాల మీదుగా పాఠశాలల సాక్షిగా ఎంతగా వెల్లువెత్తిందో సుధేశ్ గౌతమ్ వ్యాఖ్యను పరిశీలిస్తే అనుభవంలోకి రాగలదు.
ఇదిగో అందుకే కాలాన్ని చరిత్రను బహుజన దృక్పథంతో దళిత చైతన్యంతో అనుశీలించమని కొత్త తరానికి ఏప్రిల్ మాసం ఉపదేశిస్తోంది. కాలం చరిత్రా కావాలని విస్మరించిన మహనీయులను గుర్తు చేసుకొమ్మని, వైతాళికుల ఆశయాల సాధనకు ఉపక్రమించమని భవిష్యత్తరాలకూ ఏప్రిల్ పిలుపునిస్తోంది. ఇంతకాలం పునరావృతమవుతూ వస్తున్న పాఠ్యలోపాన్ని పరిష్కరిస్తూ ఏప్రిల్ మాసం సాంస్కృతిక రంగంలోకి కొత్త ఎజెండాను మోసుకొస్తున్నది. భుజాన వేసుకోవాల్సిందెలాగో ఈ నెలలో జన్మించిన ప్రేరణామూర్తుల జీవిత సారాన్ని ఒడిసి పట్టుకుంటే మనకు అట్టే బోధపడగలదు. ప్రముఖ దక్షిణాసియా రాజకీయ చరిత్ర విశ్లేషకులు ప్రొఫెసర్ క్రిష్టోఫర్ జఫర్లోట్ మాటల్లోచెప్పాలంటే ‘సంప్రదాయ ప్రజాస్వామ్యం విముక్తమై ప్రజాస్వామ్యం యొక్క ప్రజాస్వామ్యీకరణం ఫలాలు అందుకునే తరుణంలో భారత దేశానికి జాతి ప్రజాస్వామ్యం దాపురించింది’ అంటే అంబేద్కర్ మహనీయుడు ఆశించిన సామాజిక ప్రజాస్వామ్యానికి మరింత దూరం పెరిగింది. లౌకిక ప్రజాస్వామ్యం అంతరిస్తూవస్తున్నది. ఈ విపత్తును అధిగమించేందుకు దళిత బహుజనుల మధ్య బలమైన ఐక్యతా వారధి నిర్మాణంకావాల్సుంది.
ఇందుకు ఏప్రిల్ నెల అవసరం పడతుంది. విస్మృత వీరాగ్రేసరులు (Unsung Heroes)ను తనివితీరా స్మరించడం, క్రూరమైన గతం మీద రాజకీయంగా సదిశలో ఉద్యమించడం ఈ నెలంతా అడుగు వర్గాలకు కాలం చరిత్రా ఇస్తున్న ఉమ్మడి కార్యాచరణ. అందరిలాగే మహనీయుల జనన మరణాలూ కేలండరులో ఆయా మాసాల్లో సంభవించడం యాదృచ్ఛికమే. ఒకే నెలలో జన్మించిన వారందరికీ ఒకే భావజాలం కార్యాచరణ ఉండటమనేదే ఇక్కడ విశేషం. ఇందుచేతనే ఆ నెలలకు ఓ ప్రత్యేకత దక్కుతుంది. అయితే, ఏప్రిల్‌లో జన్మించడం మాత్రం యాదృచ్చికం కాదు, పుడితే ఏప్రిల్ లోనే పుట్టాలని చాలా మంది అనుకుంటారని, జన్మించాలనుకునే వారందరికీ ఏప్రిల్ కలల నెల అని అనేక అధ్యయనాలు చెబున్నాయి. ఏప్రిల్ శిశువులు ఆరోగ్యవంతమైన జీవితాలను గడుపుతున్నారని, కెరీర్‌లో రాణిస్తారని, మరింత ఆశావహులు అని, పని పట్ల మక్కువ, స్వతంత్ర వ్యక్తిత్వం, నూతన ఆవిష్కరణ స్వభావం కలిగి ఉంటారని, ప్రతిభకు ప్రతిష్ఠాత్మక నిర్వహణకు విశ్వసనీయతకు మారు పేరుగా రాణిస్తారని పరిశోధనల్లో తేలింది కూడా.
దళిత బహుజనులకు అత్యంత ఆరాధ్యులు, ప్రాతఃస్మరణీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రాం, బిపి మండల్, దొడ్డి కొమురయ్య ఈ ఏప్రిల్ నెలలోనే జన్మించారు. వీరి జన్మదినోత్సవాలు వాంఛిస్తున్నదేమంటే, అనాదిగా ‘జ్ఞాన కులీనులు (Knowledge Elites), ఆధిపత్య కులీనులు (Power Elites), వ్యవసాయ కులీనులు (Agrarian Elites)’ చెలాయిస్తున్న అన్నిరకాల ఆధిపత్యాలను దోపిడీని నిమ్నవర్గాలు ఎదుర్కొని నిలబడాలని, అస్తిత్వ పరిరక్షణను కొనసాగించమని. అణచివేత నిర్బంధం బానిసత్వాలను రూపుమాపేందుకు ఫూలే, అంబేడ్కర్, జగ్జీవన్ రాంలు చూపిన పోరాట పంథా అటు నైతిక విలువల పరిరక్షణకూ ఇటు సామాజిక విలువల పరిపక్వతకూ యావత్ప్రపంచానికి నిదర్శనం.
మన దేశంలో 2015 నుండి దళిత చరిత్ర మాసానికి అంకురార్పణ జరిగింది. తెన్మొళి సౌందరరాజన్, క్రిస్టినా ధనరాజ్, మారి జ్విక్- మైత్రేయి, సంఘపాలి అరుణ, ఆషా కౌటల్, మనిషి దేవి తదితర ఉద్యమకారులు దళిత చరిత్ర మాసాన్ని ప్రతిపాదించారు. ఇందుకు మనకు అమెరికన్లు, యూరోపియన్లు తమ తమ దేశాల్లో నివసిస్తున్న నల్లజాతీయుల గౌరవార్థం ఫిబ్రవరి, అక్టోబరు మాసాల్లో జరుపుకునే ‘Back History Month’ ఒకింత ప్రేరణ. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఎప్పటి నుంచో ఏప్రిల్ దళిత చరిత్ర మాసంగా పాటిం పబడుతుంది. అంబేడ్కరిస్టులు ఈ నెలంతా అక్కడ ఉత్సవాలు, ర్యాలీ లు, చర్చలు, పుస్తక ఆవిష్కరణలు, ప్రాజెక్టులు, కళా ప్రదర్శనలు, మీడియా ద్వారా ప్రసారాలు నిర్వహిస్తున్నారు.
ప్రతిఘటనా యోధుల అసమాన శౌర్యప్రతాపాలను పునరుజ్జీవనోద్ధారకుల అజరామరత్వాన్ని కీర్తించుకోవడానికి, నిమ్నజాతులను ఏకం చేయడానికి దళిత చరిత్ర మాసం ఇవాళ్టి ఈ ఉపఖండపు అవసరం. 1926 ఫిబ్రవరి 7న నీగ్రో చరిత్ర వారాన్ని ప్రారంభిస్తూ చరిత్రకారుడు కాటర్ జి. వుడ్సన్ మహానుభావుడు ఇట్లా If a race has no history, if it has no worth-while tradition, it becomes a negligible factor in the thought of the world, and it stands in danger of being exterminated అంటారు. ఈ వ్యాఖ్య మన దేశానికి వర్తిస్తుంది. ఇక్కడి యావన్మంది దళిత బహుజనుల పురాణేతిహాసాలను, చారిత్రక ఘట్టాలను ఫూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో భావితరాలకు తప్పనిసరి బోధించవలసిన కారణాన దళిత చరిత్ర మాసం ప్రాసంగికమవుతున్నది. మూలవాసుల కోసం, నిస్సహాయుల కోసం బతుకులను అర్పించిన బిర్సాముండా, సావోత్రీబాయి ఫూలే, సాహూజీ మహారాజ్, రమాబాయి అంబేడ్కర్, ఉదా దేవి, ఫాతిమా షేక్, గ్రేస్ భానూ, కొమురం భీం, పూలన్ దేవి, బేబితాయ్ కాంబ్లేలను విద్యార్థులు చదువుకోవాల్సి వుంది.
సత్యశోధక సమాజం చూపే మార్గంలో ‘గులాం గిరి, కుల నిర్మూలన’ ఇత్యాది రచనల తాత్త్విక పునాదులను చాటుతూ ఇటీవల వచ్చిన ‘వాటర్ ఇన్ బ్రోకెన్ పాట్’, ‘అఫైర్స్ ఆఫ్ కాస్ట్’, ‘కాస్ట్ ప్రైడ్’, ‘ద ట్రౌమా ఆఫ్ కాస్ట్’ వంటి గ్రంథాలు మరెన్నో సాహిత్యంలో వెలుగుచూడాల్సి వుంది. నేనే (వ్యాస రచయిత తన ‘బోధి వృక్షం’ కవితా సంపుటి ముందు మాట లో) భావిస్తున్నట్టు ‘చదువుతున్నప్పుడు రాయాలనిపిస్తుంది, రాస్తున్నప్పుడు చదవాలనిపిస్తుంది, రాయడం చదవడం కాల క్షేపమో సాత్విక వ్యాపకమో కాకుండా ఒక రాజకీయావసరమని బోధపడింది.
ఎందుకంటే చరిత్ర అంతా రాసుకున్న వాళ్లది, రాయించుకున్న వాళ్లది కనుక’ ఇప్పుడున్న రాజకీయాల స్వరూప స్వభావాలను సమూలంగా మార్చకుండా దేశంలో అంబేడ్కర్ ఆశించిన సామాజిక ప్రజాస్వామ్యం సాధ్యపడదు.ఏ మార్పుకు ఉద్యమించాలన్నా చరిత్రే మూల ధాతువు, హేతువు .మరాఠా దళితపాంథర్స్ ఉద్యమం ఉద్ఘాటించినట్టు ‘నీ గురించి నువ్వు రాసుకో. నీ భాషలో నువ్వు రాసుకో. నీ వాళ్లకు వినిపించుకో’ అన్న రచనా సూత్రానికి కట్టబడి దళిత బహుజన రచయితలంతా బేషరతుగా సృజనకు రచనల ముద్రణకు అధ్యయనానికి ఆవిష్కరణలకు అనువాదాలకు ఏప్రిల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాల్సివుంది. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ సూక్తి ‘బోధించు పోరాడు సమీకరించు’లో బోధించే తొలి బృహత్కార్యాన్ని సాహిత్యమే చేయగలదు. మండుటెండల్లో మానవాళిని పూలతో ఉపశమన పరచే ఏప్రిల్ ఫూలేయిజాన్ని గొంతున మోసుకొస్తుంది. ఏర్పాటు చేసి స్వాగతించాల్సింది దళిత బహీజన మైనార్టీ ఆదివాసీలే.
డా. బెల్లియాదయ్య
9848392690