దళితబంధు పథకంతో దళితులంతా ఆర్థికంగా ఎదుగుతారు
దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: దళితబంధు పథకం అమలుతో వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదుగుతారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వాసాలమర్రి దళితులు సిఎం కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని, ఈ గ్రామ దళితులు ఆర్థికంగా విజయం సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలని జోస్యం చెప్పారు. ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని కొనియాడారు. గొప్ప గొప్ప కలలు కని వాటిని సాకారం చేసే దమ్మున్న నాయకుడు కెసిఆర్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సి కార్పొరేషన్ ఇడి శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపిటిసి నవీన్‌తో పాటు తుర్కపల్లి మండల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పలువురు లబ్ధిదారులు, పాల్గొన్నారు.