Saturday, February 22, 2025

దళిత జీవన వేదనలను పలికిన కవి గుల్జార్

- Advertisement -
- Advertisement -

మొహబ్బత్, ఇష్క్, వియోగం, దుఃఖం ప్రేయసి కోసం పరితపిస్తూ విరహపు గజల్స్, షేర్ షాయరీ పాటలు రాసే గుల్జారే చాలా మందికి తెలుసు. కానీ గుల్జార్ చాలా సామాజిక కోణాలున్న కవిత్వం రాశారు. దేశభక్తి, మతతత్వపు ఫాసిజం, దేశవిభజన కాలపు విడిపోయిన మనుషుల దుఃఖం, వదిలి పెట్టిన ఊరు, అమ్మ, కుటుంబ… మానవ సంబంధాలు, సామ్రాజ్యవాద వ్యతిరేకత లాంటి కవితా వస్తువుల మీద గుల్జార్ రాశారు. అయితే గుల్జార్ నుంచి భారత దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని అమానుషత్వం గురించి, అంటరానితనం, వెలివేతలు లాంటి వివక్షలు, దళితులపై ఆధిపత్య కులస్థుల దమనకాండల గురించి కూడా కవిత్వం వచ్చింది.

దళిత కవితా వస్తువులో కూడా ఆయన విస్తృతి ఎక్కువ. ఊర్లలో దళితుల్ని ఇంకా ఎలా అంటరాని చాయ్ కప్పులుగా మాత్రమే చూస్తారో, తమకంటే అన్ని రంగాలలో ఎదిగిపోతున్న దళితుల ఆత్మగౌరవాన్ని, అస్మితను భరించలేని పీడక కులస్థుల అణగని అహంకారం గురించి, దళిత ప్రతిఘటనా అస్తిత్వ ఉద్యమాలు నడుస్తున్న కాలంలో దళితుల రక్తంలో, బానిసత్వాన్ని, అంటరానితనాన్ని వెతికే కరడుకట్టిన బ్రాహ్మణీయ ఆధిపత్య కులాలు, దళితుల్ని, ముస్లిం మైనారిటీలను వెంటాడి వేధిస్తూన్న హిందూ మత ఫాసిజం లాంటి అనేక వస్తువుల మీద రాశారు గుల్జార్.

గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కాల్రా. బాల్యంలో తల్లిని కోల్పోయిన గుల్జార్ అత్యంత బీదరికంలో, గ్రామీణ వాతావరణంలో పెరిగాడు. కార్లకు పెయింట్ వేసే పని చేస్తూ బతికాడు. గ్రామాల్లో అంటరానితనాన్ని దగ్గరగా చూసినవాడు అప్పుడూ, ఇప్పుడూ కూడా గ్రామాల్లో దళితులకు హోటళ్లల్లో గ్లాసులు, ఛాయ్ కప్పులు ఇతరులకు విడిగా పెట్టే అమానవీయమైన పద్ధతిని చూసినవాడు. గుల్జార్ కుల వివక్షపైన రాసిన కొన్ని కవితలను ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి, సాహిత్య చరిత్రకారిణి రక్షణదా జలాల్ హిందీ, ఇంగ్లీషు భాషలలోకి అనువాదం చేశారు. వాటిలో కొన్ని..
అతనొక బీటలు వారిన,
హ్యాండిల్ లేని కప్పులా ఉన్నాడు
ఎవరూ ఆ కప్పులో నోరు పెట్టరు
పెదవుల్ని, వేళ్లని కాల్చే కప్పులవి
చివరికో రోజు బాస్
అతన్ని బయటకు తోసేసి
ఛల్ దళితుడా బయటకు పో అంటాడు.
అప్పుడు ఆఫీసులో అందరి
మొఖాలు మూలన పెట్టిన అంటరాని కప్పుల్లా బీటలువారతాయి.

అంటూ దళితుల అంటరానితనపు వేదనని బీటలు వారిన కప్పులతో పోలుస్తూ బాధపడతాడు. దొరల పొలాల్లో పని చేసే దళిత రైతుల శ్రమ దోపిడీని గురించి రాస్తూ అసలు వీళ్లు మనుషుల్లా కాదు. యజమాని ఒక్క కొరడా ఝులిపింపుకి కాడెద్దులా.. పశువుల్లా మారిపోతుంటారు అని వాళ్ల నిస్సహాయతకు దుఃఖిస్తూ ఎద్దులకు బదులు మనిషే నాగలిని గుంజుతున్నప్పుడు అనే కవితలో అప్పుడు అతడొక ఎద్దులా మారిపోతాడు కొమ్ములు మొలుస్తాయి. నాగలిని గుంజ లేని అతని పాదాలు చిట్లిపోతాయి. జమీందారు కొరడా దెబ్బకి కదిలే అతను నాలుగు కాళ్ల జంతువు కంటే తక్కువేం కాదు అంటూ ఆకలి, కులం కాట్లు పడ్డ మనిషి అస్తిత్వం జంతు సమానం అయిపోయే దుర్భర స్థితిని పేర్కొంటాడు గుల్జార్.
పదునైన కత్తిలాంటి కులవ్యవస్థ మీద నడుస్తూ ఉన్న దళితుడి గురించి రాస్తూ.. కత్తి కొన మీద కోసిన మోసంబీ పండు రసం మీద వాలిన పురుగు ఎన్నోసార్లు జారిపోతూ నిలదొక్కుకుంటూనే.. ఆఖరికి ఎండిన రసం అంటిన కత్తి చివరి అంచుపైనుంచి అది తనను తాను రెండుగా.. ఛీలకుండా బయట పడాలి. ఆ పురుగూ.. నేను ఇద్దరమూ.. కత్తికొన మీద నడుస్తూనే తప్పించుకోవాలి. అంటే… రెండుగా చీలిపోవాలి.

ఎందుకంటే ఇక్కడ ఆ పురుగూ., నేనూ ఇద్దరమూ దళితులమే కాబట్టి అంటూ కులవ్యవస్థ చేసే గాయాలని, నొప్పిని భరిస్తూనే జీవించడాన్ని లేదా బలి అయిపోవడాన్ని రాస్తారు. ఎత్తు మడమల చెప్పు అనే కవితలో ఆధిపత్య కులం వాడికి దళితుడితో మాట్లాడేటప్పుడు ఎలాంటి చెప్పులు వేస్కోవాలో సలహా ఇస్తూ నీకంటే ఉన్నతంగా ఎదిగిన దళితుడితో మాట్లాడేటప్పుడు., కాస్త ఎత్తు మడమలున్న చెప్పులు వేసుకో.. ఎందుకంటే నువ్వు నాకంటే పొట్టివాడివి, చిన్నవాడివి., తలెత్తి మాట్లాడేటప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుంది. పైగా నుదురు ముడిచేసేటప్పుడు మరింతగా కుచించుకుపోతావు
అంటూ తమకంటే అన్ని రంగాలలో దూసుకుపోతూ ఉన్నతంగా ఎదుగుతున్న దళితులని చూస్తూ భరించలేక హేళన చేసే ఆధిపత్య కులస్థుల అహంకారాన్ని హేళన చేస్తాడు.

అలాగే లౌట్‌కే ఆనేవాలే పానియోసే (వెనక్కి తిరిగొచ్చే ప్రవాహంతో) అనే కవితలో దినమంతా కేరళ సముద్రంలో పడవల మీద కష్టపడే శ్రామికుల గురించి రాస్తూ., సముద్రం వెచ్చని ఉప్పుగా ఉండే వేళ్ళతో తన తల వెంట్రుకలని నిమురుతుంది, చల్లగా శరీరాన్ని స్పర్శిస్తుందని… రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరినప్పుడు ఎండిన పిడకలు కాలుతూ.. దాని పొగ ., పరిమళాలని దేహంలోని ప్రతి రంధ్రమూ శ్వాసిస్తుంది.

చూడు అసలైన జీవన పరిమళం మా దళితుడి దేహం నుంచి ఎలా వ్యాపిస్తుందో అంటూ శ్రమ తాలూకు గొప్పతనాన్ని, సౌందర్యాత్మకంగా చెప్తాడు. అలాగే బ్లడ్ టెస్ట్ అనే కవితలో ఏం వ్యాధులున్నా యో అని దళితుడి రక్తాన్ని లాబొరేటరీలో మైక్రోస్కోపి కింద పరీక్షిస్తే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దారిద్య్రం, బానిసత్వంతో పాటు వాళ్ల కళ్లకు సూక్ష్మాతి సూక్ష్మమైన విప్లవించే కణాలు కూడా కనపడ్తాయి అని చెబుతూ ఆధిపత్య కులాలను పెద్దగా ప్రమాదంలో పడెయ్యని వేడి, ఉధృతమైన స్వాభిమానపు మెరికలు కూడా మా రక్తంలో చూడొచ్చు అని చెబుతాడు. తాబేదారి హుకుమారోకి.. జోమేరే ఆజాదీ- జి -ఆజ్‌దాదా ఔర్ గులామీ భీతో కుచ్ పుష్తోతాక్ ఖూన్ మే లహరాతీ హై ధోడీ సీ గర్మీహై ఖూన్ మే ఫర్ కోయి విస్ఫోట్ కా ఖత్‌రా నహీ.. హాం.. ఆనాకీ కిర్ కిరీ షాయిద్ మిలే!

అంటూ దళితుని రక్తంలోని తిరుగుబాటు చేస్తున్న రక్తకణాల సంచలన కదలికలను గురుంచి మార్మికంగా చెబుతాడు.
ఈ అడవి కొమ్మలపైన అనే కవితలో… ఈ అడవి చెట్ల కొమ్మలపై అక్షరాలు మొలకెత్తినా.. అవి పదాలు కవితలుగా ఎన్నటికీ మారవు. ఈ మొక్కలకి సరైన పోషకాలు, నీళ్లు దొరకవు. కనీసం వేర్లు ఆరోగ్యంగా పెరగడానికి కుండీలు కూడా దొరకవు. ఆఖరికి మొక్కలు ఆ వీధుల్లోనే విసిరివేయిబడతాయి. అవి ఆఖరికి దుమ్ము ధూళిలోనే, ఆకలితో పెరుగుతాయి. కొన్ని మురికివాడల్లో విసిరి వేయబడి అక్కడ నీళ్లు మట్టి దొరికి ఆఖరికి పెరగడం మొదలుపెడతాయి. అవును మరో దళిత మొక్క ఆ మురికి వాడల్లోనే పెరిగి వృక్షమవుతుంది అంటాడు. ఇలా గుల్జార్ తాను రాసిన దళిత కవిత్వంలో భారతదేశంలో పాలక వర్గం పని గట్టుకుని యథాతథ అణచివేతల, వివక్షల వ్యవస్థ రక్షణ కోసం ఓట్ల పోలరైజేషన్ కోసం పెంచి పోషిస్తున్న కుల వ్యవస్థపైన ఆగ్రహ ప్రకటన చేస్తారు.

గీతాంజలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News