పలాన్‌పూర్ : దళితుడైన వ్యక్తి మంచి దుస్తులు ధరించి, నల్లకళ్లద్దాలు పెట్టాడని ఓర్వలేనితనంతో అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు దాడి చేసిన సంఘటన గుజరాత్‌లో జరిగింది. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా పలాన్‌పూర్ తాలూకా మోటా గ్రామానికి చెందిన జిగర్ షిఖాలియా అనే దళిత వ్యక్తి మంగళవారం ఉదయం మంచి దుస్తులు ధరించి నల్లకళ్లద్దాలు పెట్టుకుని తన ఇంటి బయట నిలుచుని ఉండగా, అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి వచ్చి ఓర్వలేనితనంతో “ఈరోజుల్లో కూడా మంచి ఎత్తున ఎదుగుతున్నావు.
తన స్థాయిలో ఉండకపోతే చంపుతా ” అని బెదిరించాడు. అదే రోజు రాత్రి గుడి వద్ద ఉన్న జిగర్ వద్దకు నిందితులు కర్రలతో వచ్చి మంచి దుస్తులు ధరించి, నల్లకళ్లద్దాలు పెట్టుకోవడాన్ని నిలదీశారు. అంతటితో ఆగకుండా డైరీ పార్లర్ వెనక్కు ఈడ్చుకుంటూ వెళ్లి కర్రలతో చితక బాదారు. దీన్ని చూసిన జిగర్ తల్లి వచ్చి అడ్డుకోడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశారు. చంపుతామని బెదిరించారు.
ఆమె ఒంటిపైని వస్త్రాలను చించివేశారని తమకు ఫిర్యాదు అందిందని పోలీస్‌లు చెప్పారు. అకారణంగా దూషించడమే కాకుండా దాడి చేశారని నిందితులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అరాచకాల నివారణ చట్టం కింద నిందితులపై పోలీస్‌లు కేసు దాఖలు చేశారు. అయితే ఇంతవరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు.