Monday, December 23, 2024

వివక్ష కుల జీవన గీతం ‘మా లచ్చుమమ్మ’

- Advertisement -
- Advertisement -

దళిత సాంస్కృతిక అస్తిత్వ చిహ్నాలను పదిలపరచిన నవల – మాలచ్చుమమ్మ. రచయిత భూతం ముత్యాలు లచ్చుమమ్మ ను ప్రధాన పాత్రగా మలుచుకుని దళితుల సామాజిక జీవన ప్రతిబింబాన్ని మానవీయ కోణంలో ఈ నవలలో ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లావాసి అయిన భూతం ముత్యాలు వృత్తిరిత్యా ప్రధానోపాధ్యాయులు. ప్రవృత్తి రిత్యా కవిగా, కథకుడిగా, నాటక కారుడిగా, నవలా కర్తగా, వ్యాసకర్తగా చిరపరిచితులు. గతంలో వెలువరించిన ‘సూర’ ‘పురుడు’ ‘ఇగురం’ ’మొగలి’ నవలల్లోనూ ’మాలపల్లి కథలు’, బేగరి కథలు’, ‘బుగాడకథలు’, మొదలైన కథా సంపుటాల లోనూ, ‘దుగిలి’ కవితాసంపుటి లోనూ దళిత స్పృహ స్పష్టంగా గోచరిస్తుంది.ఆధిపత్య వర్గాలచేత అస్పృశ్యులుగా పరిగణింపబడి,అంచులకు నెట్టివేయబడిన దళిత వర్గాల వైయుక్తిక, సామాజిక జీవితాల్లోని ఎన్నో విషాద కోణాల్ని వీరి రచనలు స్పష్టంగా ఎరుక పరుస్తాయి.

అమానవీయ పరిస్థితులకు లోబడి బతుకుల్ని వెళ్లదీసే దళిత వర్గాల జీవితపు లోతుల్ని తడిమి చూపుతాయి. తరాలుగా వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థలోని వివక్ష కులాల సంస్కృతిని ప్రధానంగా పట్టి చూపుతాయి. ‘మా లచ్చుమమ్మ’ నవలలో ఇతివృత్తం ఆసాంతం లచ్చుమమ్మ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. లచ్చుమమ్మ కథలో అంతర్భాగంగా మాలకుల సాంస్కృతిక ఉనికికి దర్పణం పడుతుంది. పండుగ-పబ్బాలు, చావు-పుట్టుకలు, విందు-వినోదాలు, మోదఖేదాల్లో వ్యక్తమయ్యే ఆచారసంప్రదాయాలను అడుగడుగునా వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా దళిత స్త్రీ దృక్కోణంలో రాయబడి,నిత్యజీవితంలో స్త్రీ మానసిక సంఘర్షణను, కుటుంబం పట్ల అవ్యాజమైన ఆమె మమకారాన్ని చూపుతూ పరిస్థితులకు తలొగ్గి జీవించే మగువల మనఃస్థితిని ప్రతిబింబిస్తుంది.

రేచర్ల గోత్రులుగా ప్రఖ్యాతి వహించిన మాల కుల అమాయక వనిత లచ్చుమమ్మ.70 సంవత్సరాల లచ్చుమమ్మ జ్ఞాపకాల జడివానలో లచ్చుమమ్మ తోపాటు పాఠకుడు సహానుభూతిని పొందుతూ తడిసి ముద్దవుతాడు. ఆమె జ్ఞాపకాల నిండా పరచుకున్న మానవీయ బంధాల స్పర్శ పాఠకుడిని వెచ్చగా తాకుతుంది. ఆమె పుట్టుక మొదలు మరణం దాకా కొనసాగిన ఈ నవల సగటు దళిత స్త్రీ జీవితంలోని అనేక పార్శ్వాలు చూపుతుంది.

పసివయసులోనే తండ్రిని కోల్పోయి, తల్లిచే నిరాధారింపబడి, నాయనమ్మ తాతల సంరక్షణలో పెరిగిన లచ్చుమమ్మ సగటు దళిత స్త్రీ కి ప్రతినిధిగా కనిపిస్తుంది.తాత, నాయనమ్మ ల సంరక్షణలో గారాబంగా పెరిగి, అన్నింట్లో అరితేరి ,తన చుట్టూ ఉన్న వారికి జీవిత పరిమళాలను హృద్యంగా పంచుతుంది. కాచి వడబోసిన జీవితం ఆమెది. కష్టాలు, కన్నీళ్లను సమంగా స్వీకరించిన దయార్ట్ర స్వభావిని.బతుకుదారిలో ఎన్ని ఒదుడుకులను ఎదురుకొన్నా స్థితప్రజ్ఞతను కోల్పోని లచ్చుమమ్మ తత్త్వం ఆదర్శప్రాయం.

దళిత స్త్రీ జీవితంలోని విభిన్న పార్శ్వాలను వాస్తవిక దృష్టితో చెబుతూనే, స్త్రీ అంతరంగావిష్కరణను సమర్థవంతంగా రూపుకట్టించారు రచయిత. నవలలో ఎదురయ్యే ప్రతి పాత్ర మన కళ్ళ ముందు కనిపించే వ్యక్తులను చూపుతూ సజీవ దృశ్య కావ్యంగా నిలుస్తుంది. మాలచ్చుమమ్మ నాయనమ్మ, తాతాలైన దుర్గమ్మ, పెద్దులు పాత్రలు సమాజంలో సగటు దంపతులకు నమూనాగా కనిపిస్తాయి. వారి దాంపత్యం ఎటువంటి భేషజాలు లేకుండా సాగుతూ కష్టాలను కన్నీళ్లను ఎదురుకుంటున్నా సరే, పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచే దంపతులు వారు.

తల్లిదండ్రులు లేని మనుమరాలిపై వారు చూపే ప్రేమ అనుపమానం ఎల్లెడలా విస్తరిస్తున్న ఆధునికత ధాటికి, క్రమంగా కనుమరుగవుతున్న ఒకనాటి సాంస్కృతిక ఆనవాళ్లు నవలనిండా పరచుకొని నవలకు నిండుతనాన్ని చేకూర్చాయి. నవల ఆసాంతం తెలంగాణ భాష, యాస లో రాయడం ఒక ప్రత్యేకత. తెలంగాణ పల్లెల్లో పరిమళంచే స్వచ్ఛమైన భాషా సుగంధం నవలకు అదనపు ఆకర్షణ గా నిలుస్తుంది. జానపదుల గుండె లోతుల్లోంచి ప్రవాహమై సాగె పాటలు నిన్నటి బతుకు మధుర్యాన్ని అనుభూతిమయం చేస్తాయి.‘మూడు తరాల తండ్లట’ పేరుతో సంగిశెట్టి శ్రీనివాస్ గారు,‘మానవీయ భావాల గుండె తడి’ శీర్షిక తో డా. సూర్య ధనంజయ్ గారు, ‘బతుకు తాలూకు జ్ఞాపకం మా లచ్చుమమ్మ’ పేరుతో డా. కందుల శివకృష్ణ గారు రాసిన ముందుమాటలు కొండనద్దంలో చూపిన చందంగా నవల సారాంశాన్ని పట్టిస్తాయి. మాల కుల అస్తిత్వ సోయితో ఈ నవలను వెలువరించిన భూతం ముత్యాలు గారు కొంత సామాజిక చరిత్ర ను ముందు తరాలవారికి సమర్థవంతంగా అందించగలిగారని చెప్పడం సముచితం.

-డా.వి.వింధ్యవాసినీ దేవి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News