ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం జూన్ 28కి ముగుస్తున్నాయి కూడా. పివి పుట్టిన సంవత్సరంలోనే నాలుగు నెలలు ముందు పుట్టిన సంజీవయ్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ శత జయంతి వేడుకలు తలపెట్టకపోవడం శోచనీయం. అంతటి మహా నాయకుల్ని విస్మరించడం జరిగిందా! సంజీవయ్య సంయుక్త మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలోనూ, ప్రకాశం మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ, నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా పని చేశారు. కేంద్రంలో కూడా నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్వితీయ ముఖ్యమంత్రి. అద్వితీయ తొలి దళిత ముఖ్యమంత్రి. పిన్నవయసులోనే (38 సంవత్సరాలు) ముఖ్యమంత్రి అయిన మహా నాయకుడు. దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో పెద్దపాడు గ్రామంలో జన్మించారు. పెదపాడు గ్రామం కర్నూలుకు ఐదు కిలోమీటర్ల దూరమే. ఆయన చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు. తలిదండ్రులు సుంకులమ్మ, మునయ్య.సంజీవయ్య పుట్టిన మూడేళ్లకే తండ్రి మునయ్య మరణించారు. తల్లితో పాటు చిన్నప్పుడే మేనమామ ఊరు ప్యాలకుర్తికి వెళ్లారు. మళ్లీ మూడేళ్లకు పెదపాడు వచ్చారు. తల్లి కూలి పని చేసింది. సంజీవయ్య ఒక భూస్వామి దగ్గర పసుల పిల్లవాడిగా పని చేశారు.
సంజీవయ్య అన్న చిన్నయ్య సంజీవయ్య తెలివితేటలను గమనించి ఊళ్ళోని స్కూల్లో చేర్పించారు. రెండు సంవత్సరాల తర్వాత కర్నూలులో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను చదివి మున్సిపల్ హైస్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్సీ వరకు చదివారు. ఎస్‌ఎస్ ఎల్‌సిలో జిల్లా కంతటికి ప్రథముడిగా వచ్చారు. స్కూల్ విద్యార్థి దశలో పుట్టపర్తి నారాయణా చార్యుల వారు ఆయనకు తెలుగు బోధించిన గురువు. కొన్నాళ్ళు రేషన్ షాపులో గుమస్తా గాను, బళ్లారిలో కేంద్ర ప్రజా పనుల శాఖ తనిఖీ అధికారి గాను పని చేశారు. ఆ తర్వాత 1946లో మద్రాసు పచ్చయప్ప స్కూలులో పార్ట్ టైం గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ లా కళాశాలలో చదువుకున్నారు. లా కళాశాలలో ప్రముఖ రచయిత రావిశాస్త్రి ఆయనకు సహాధ్యాయి. మద్రాసులో లా అప్రెంటిస్‌గా పని చేస్తున్న ప్పుడే ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. మొదట ఆయన ప్రొవిజనల్ పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. 1952లో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై రాజాజీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. అది మొదలు ఆయనకు పదవులు ఎడతెరిపి లేకుండా వెంటవెంటనే వచ్చాయి. 1960లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ పిలుపు మేరకు సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవికి అల్లూరి సత్యనారాయణ రాజు, కాసు బ్రహ్మానందరెడ్డిల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాజీ అభ్యర్థిగా నిజాయితీపరుడు, వివాద రహితుడు విద్యావంతుడు అయిన సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన 11 జనవరి 1960 నుంచి మార్చి 12, 1962 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సంజీవరెడ్డి మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు సంజీవయ్యను కేంద్రంలో నెహ్రూ రప్పించుకొని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
1954లో సికింద్రాబాదులో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న కృష్ణవేణమ్మను వివాహం చేసుకున్నారు. వారికి సంతానం కలగకపోతే సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సంజీవయ్య తెలుగు, ఇంగ్లీషు భాషల్లోఅనర్గళంగా మాట్లాడగలిగే వక్త. ఆయన తెలుగు ఉపన్యాసం జాతీయాలు సామెతలు పద్యాలతో వినసొంపుగా ఉండేది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే హిందీ పరీక్షలు కూడా పాస్ అయ్యారు. సంజీవయ్యకు నాటకాలు అన్నా, హరికథలు అన్నా చాలా ఇష్టం. కొన్ని నాటకాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. శివాజీ, శశిరేఖా పరిణయం నాటకాలు రాశారు. పద్యగయోపాఖ్యాన నాటకాన్ని వచనంలో రాశారు. హరికథలు కూడా రాశారు. ఆంగ్ల భాషలో ‘లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్’ అనే పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్ ప్రచురణ సంస్థ ప్రచురించింది. 1970లో అఖిల భారత తెలుగు రచయితల మహా సభలకు అధ్యక్షత వహించారు. సంజీవయ్య నిజాయితీకి రెండు మూడు ఉదాహరణలు చెబుతారు. సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత ఊరు పెదపాడుకు పోయినప్పుడు తల్లి తలపై కట్టెలమోపును పెట్టకొని ఎదురు వచ్చిందట. అప్పుడు కారు దిగి ‘అమ్మా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అని చెప్పాడట. ‘ఇప్పుడన్నా నీ జీతం పెరిగిందా నీ కష్టాలు తీరాయా’ అని అమాయకంగా అడిగిందట ఆ తల్లి. ముఖ్యమంత్రి అయినా ఇల్లు కట్టుకోలేదు. శిథిలావస్థలో రెండు గదుల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉన్నది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పెదపాడు వెళ్లి కీర్తిశేషులు సంజీవయ్య ఇల్లు చూసి ఆయన నిజాయితీని ఎంతగానో ప్రశంసించారు. సంజీవయ్యకు సొంత ఇల్లే కాదు సొంత కారు కూడా లేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత మరుసటి రోజు తాను తన భార్య కలిసి నడుచుకుంటూ వెళ్లి సినిమా చూసి వచ్చారు.
మొదటి సారిగా వృద్ధాప్య ఫించన్, అవినీతిని అంతమొందించడానికి అనిశా (ఎసిబి) సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లను కలిపి కార్పొరేషన్ చేశారు. కార్మికులకు మొదటి సారిగా బోనస్ పథకం ప్రవేశపెట్టారు. ఎస్‌సి, ఎస్‌టి, బిఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్‌లలో కూడా రిజర్వేషన్ కల్పించారు. బోయలను ఎస్‌టి జాబితాలో చేర్చారు. భారీ చిన్నతరహా కార్పొరేషన్లను, గనుల కార్పొరేషన్‌ను నెలకొల్పారు. పులిచింతల, వరదరాజుల, వంశధార నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రొవిజినల్ పార్లమెంటు సభ్యుడు, రాజాజీ మంత్రివర్గంలో మున్సిపల్ సహకార శాఖ మంత్రి, ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య హరిజనోద్ధరణ పునరావాస శాఖ మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య రవాణా పన్నుల శాఖ మంత్రి, నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో స్థానిక స్వయం పరిపాలన శాఖ మంత్రి పదవులను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా1962 జనవరి 11 నుంచి 1964 జనవరి 6 వరకు ఉన్నారు. కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో శ్రమ ఉద్యోగ శాఖ మంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో శ్రమ ఉద్యోగ శాఖ మంత్రి, ఇందిరా గాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రి, మళ్లీ ఆమె మంత్రివర్గంలో శ్రమ పునరావాస శాఖ మంత్రిగా పని చేశారు. 1971 మార్చి 18 నుంచి 1972 మే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా పని చేశారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 1972 మే 7వ తేదీన గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయనకు 51వ ఏడే. దీర్ఘకాలం బతికి ఉంటే మరెన్నో ప్రతిష్ఠాకరమైన పదవులు అధిష్టించే వారేమో. హైదరాబాద్, కర్నూల్‌లో విగ్రహాలు, పార్కులు. కర్నూలులో ఆయన చదివిన మున్సిపల్ హైస్కూల్‌కు ఆయన పేరు పెట్టడం జరిగింది. బాలికా వసతి గృహానికి హంద్రి నది మీద నిర్మించిన గాజుల దిన్నె ప్రాజెక్ట్‌కు సంజీవయ్య సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. విశాఖ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ లా యూనివర్శిటీ కి సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఇవి కొన్ని మాత్రమే.
ఆచార్య
జి చెన్నకేశవరెడ్డి
9492047027