Saturday, December 21, 2024

దళిత మహిళను వివస్త్రను చేసి..నోట్లో మూత్ర విసర్జన చేసి…

- Advertisement -
- Advertisement -

పాట్నా: తీసుకున్న అప్పు చెల్లించివేసినప్పటికీ మరింత డడబుబ కట్టాల్సిందేనంటూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దళిత మహిళపై కక్ష పెంచుకున్న  వడ్డీ వ్యాపారి తన అనుచరులతో కలసి  దళిత మహిళను వివస్త్రను చేయడంతోపాటు ఆమెపై దాడి చేసి ఆమె నోట్లో మూత్ర విసర్జన చేసిన అత్యంత దారుణ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అషు సింగ్ పరారీలోఉండగా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లించివేసినప్పటికీ తనపై దాడి, వేధింపులు జరిగాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది నెలల క్రితం ప్రమోద్ సింగ్ నుంచి తన భర్త రూ. 1,500 అప్పు తీసుకున్నాడని, వడ్డీతో కలిపి తిరిగి చెల్లించివేశాడని ఆమె తెలిపారు. అయితే ఇంకా డబ్బు చెల్లించాలంటూ ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశాడని, అందుకు తాము నిరాకరించామని ఆమె చెప్పారు. పాట్నాలోని ఖుస్రూపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో శనివారం రాత్రి  ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరింత డబ్బు ఇవ్వకపోతే వివస్త్రను చేసి గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని ప్రమోద్ సింగ్ తనను ఫోన్లో బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును దర్యాప్తు చేసేందుకు శనివారం కొందరు పోలీసులు గ్రామాన్ని సందర్శించారని, దీంతో కోపంతో రగిలిపోయిన ప్రమోద్ సింగ్ తన అనుచరులతో కలిసి శనివారం రాత్రి 10 గంటలకు దళిత మహిళ ఇంటికి వచ్చాడు. ఆమెను బలవంతంగా లాక్కుని ప్రమోద్ సింగ్ ఇంటికి తీసుకువెళ్లారని పోలీసులు చెప్పారు. తన ఇంటి వద్దనే ప్రమోద్ సింగ్ ఆ దళిత మహిళను వివస్త్రను చేసి కర్రలతో చితకబాదాడని పోలీసులు తెలిపారు.

తన ముఖంపై మూత్రవిసర్జన చేయమని తన కొడుకుకు ప్రమోద్ సింగ్ చెప్పడమే కాకుండా తాను కూడా తన ముఖంపై మూత్రం పోశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ప్రమోద్ సింగ్, అతని కొడుకు కోసం గాలిస్తున్నట్లు పాట్నా ఎస్ఎస్పి రాజీవ్ మిశ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News