రాజమహేంద్రవరం: మంచినీరు అడిగితే పోలీసులు మూత్రం తాగమన్న దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మహిళ అదృశ్యం కేసులో వెంకటప్రసాద్ అనే యువకుడు బైక్ ఇచ్చి వాళ్ళ స్నేహితుడికి సహాయం చేసాడని తూర్పు గోదావరి జిల్లా కడియం ఎస్సై విచారణ పేరుమీద ఓ యువకుడిని పోలీస్ స్టేషనుకి పిలిచి చిత్రహింసలకు గురిచేశాడు. దాహం వేస్తుందని నీళ్లు అడిగితే మూత్రం తాగమన్నాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని పోలీసులు సర్కార్ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని దళిత యువకుడు వాపోయాడు. అపస్మారక స్థితికి చేరాక హడావిడిగా ఆస్పత్రికి తరలించారని తెలిపాడు. ఈ నెల 17న తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని వెంకట ప్రసాద్ పేర్కొన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధిత యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. కడియం ఎస్ ఐ తనను దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టాడని చెప్పాడు. బాధితుడి భార్య శిరీష మాట్లాడుతూ… రాజీకి వచ్చేందుకు ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని తెలిపింది. తన భర్తకు చిత్రహింసలు పెట్టిన వారికి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రజని ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఎస్సై శివాజీపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసి వీఆర్ కు పంపారు.