Monday, December 23, 2024

మధ్యప్రదేశ్‌లో అమానుషం

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఠాకూర్ కుటుంబం ఆటవికంగా వ్యవహరించింది. 18 సంవత్సరాల దళిత యువకుడు నితిన్ రాహుల్ అహిర్వార్‌ను స్థానిక విక్రమ్ సింగ్ ఠాకూర్ తన మనుష్యులతో వెళ్లి కొట్టి చంపాడు. అడ్డోచ్చిన యువకుడి తల్లి బట్టలూడదీశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాల జులుం పడగవిప్పి, బుసలు కొట్టిన వైనం సాగర్ జిల్లాలోని బరోడియా నానాగిర్ గ్రామంలో ఇటీవల జరిగింది. ఈ గ్రామం ఖురాయ్ దెహత్ ఠాణా పరిధిలోకివస్తుంది. ఈ అమానుష ఘటనకు సంబంధించి ఇప్పుడు వివరాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు నితిన్ సోదరి ఠాకూర్ల లైంగిక అత్యాచారానికి గురైంది. దీనిపై ఈ దళిత కుటుంబం ధైర్యం తెచ్చుకుని 2019లో కేసు పెట్టింది. దీనిని వాపసు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఠాకూరు మనుష్యులు చాలా రోజులుగా ఈ కుటుంబాన్ని వేధిస్తూ వస్తున్నారు.

అయితే తమ సోదరికి న్యాయం కోసం తాము ఎంతదూరం అయినా వెళ్లుతామని నితిన్ ఎదురుతిరిగాడు. దీనితో గురువారం ఠాకూర్ మనుష్యులు దళితుడి ఇంటికి వెళ్లి, వాదనకు దిగారు, కుటుంబ సభ్యులు వినకపోవడంతో ఇల్లు ధ్వంసం చేశారు. దళిత యువకుడిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. అడ్డం వచ్చిన యువకుడి తల్లిని వివస్త్రను చేశారు. ఆమెను కూడా కొట్టారు. కేసు వాపసు తీసుకోకపోతే ఊరుకునేది లేదని బెదిరించి వెళ్లారు. గ్రామస్తులు వచ్చి యువకుడి శవంతో భైఠాయించారు, తగు న్యాయం కోసం డిమాండ్ చేశారు. తరువాత అధికారులు ఇచ్చిన హామీ మేరకు యువకుడి అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు విక్రమ్‌సింగ్ సహా ఎనమండుగురిని అరెస్టు చేశారు.ఘటనలో పాలుపంచుకున్న గ్రామపెద్ద ఇతరులు కొందరు ఫరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మొత్తం తొమ్మండుగురిపై కేసులు పెట్టినట్లు , వీరిపై సెక్షన్ 307 , సెక్షన్ 302, ఎస్‌సి/ఎస్‌టి యాక్ట్ పరిధిలో విచారణ సాగిస్తున్నట్లు అదనపు ఎస్‌పి సంజీవ్ యుయికే తెలిపారు. కోమల్ సింగ్ అనే నిందితుడు ఫరారీలో ఉన్నాడని వివరించారు. ఈ ఘటన అత్యంత ఆటవికం అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. బిజెపి హయాంలో మధ్యప్రదేశ్ దళితులు, బడుగు వర్గాలపై పైశాచికాలకు ఓ ప్రయోగస్థలి అయిందని వ్యాఖ్యానించారు. ఇటీవలే ప్రధాని మోడీ ఈ సాగర్ జిల్లాలోనే సంత్ రవిదాస్ ఆలయాన్ని అట్టహాసంగా ఆరంభించాడని, మరి మనుష్యులపై జరుగుతున్న ఈ ఆటవికంపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News