కరీంనగర్: అర్హులందరికీ దళితబంధు పథకమిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సోమేష్ కుమార్ సమీక్షించారు. హుజూరాబాద్‌లో దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సిఎస్ సమీక్షలు జరిపారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండానే నగదు ఇస్తామన్నారు. దళిత బంధు పథకం చాలా ప్రతిష్టాత్మకమైనదని కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దళిత బంధు అమలు చేస్తామన్నారు. జులై 16న 15 మంది లబ్ధిదారులకు సిఎం కెసిఆర్ స్వయంగా పతాలు అందజేస్తారని, జాబితాలో పేర్లు లేనివారు అధికారుల దృష్టికి తీసుకరావాలని సిఎస్ సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టిఆర్ఎస్ ఎంఎల్ఎలు సుంకే శంకర్, ఆరూరి రమేష్, సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సీపీ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, వరంగల్ అర్బన్ సంధ్యారాణి జిల్లా ప్రజా పరిషత్ సిఇఒ ప్రియాంక పాల్గొన్నారు.