Tuesday, January 28, 2025

దళితాక్షర జ్వాల ‘మద్దూరి’

- Advertisement -
- Advertisement -

సమాజంలో దళితులపై వివక్ష ఈనాటిది కాదు, ఈనాటికీ పోలేదు. విశ్వవ్యాప్తంగా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది.ఆ వేదనలోంచే దళిత కవిత్వం పుట్టింది. నాడు జాషువా మొదలు నేటి వర్తమాన దళిత కవి దాకా తమ బాధామయ జీవన గతిని గబ్బిలానికో, ఊరూవాడకో చెప్పుకుంటూనే ఉన్నా రు. అయితే దళిత కవిత శోకాన్ని దాటి ఆక్రోశాన్ని చేరుకుంది.వివిధ సామాజిక ఉద్యమాల ప్రభావంతో బహుజనుల్లో వచ్చిన తెగింపు దళిత కవిత్వాన్ని ఆవహించింది. ధిక్కారం, సవాలు చేయడం దళిత కవిత్వ లక్షణంగా మారింది. తెలుగు కవిత్వంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూ నేడు భాగస్వామ్య జెండాను అది రెపరెపలాడిస్తోంది. ఒక్కో దళిత కవి, రచయిత వందల పేజీల రచనలని సృష్టిస్తున్నారంటే ఆ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో ఊహించవచ్చు. ఆ ప్రవాహ ప్రకోపం లో మద్దూరి నగేష్ బాబు సృష్టించిన హోరు కూడా మామూలుది కాదు.

దళిత కవుల్లో మద్దూరు నగేష్ బాబుది పూర్తిగా సొంతముద్ర. ప్రపంచంలో ఏ మూలాన నిమ్నవర్గం వేధింపబడినా వెంటనే ఆయన గుండెకు తెలిసిపోతుంది. ప్రతి వివక్ష వార్త ఆయన అక్షరాల తోడును కోరుకుంది. ఆయన పద్యమై స్పందించని సందర్భమే లేదు. సుమారు పదేళ్ల పాటు ఆయన కలం పట్టని రోజు లేదేమో. తన ఆవేశాన్ని అక్షరాల్లోకి దింపి అలుపెరుగని దళితక్రాంతిని రగిలించారు. ఆ పద వేడి ఎన్నటికీ చల్లారనిది. అర్ధాంతరంగా 42 ఏళ్లకే నగేష్ బాబు 2015లో భౌతికంగా నిష్క్రమించారు. ఆయన రచనలతో ‘మద్దూరి నగేష్ బాబు సమగ్ర కవిత్వం’ పేరిట బహుజన కెరటాలు అనే సంస్థ ఓ ఉద్గ్రంథాన్ని వెలువరించింది. వ్యక్తిగా, కవిగా ఆయన మన మధ్య చిరకాలం నిలిచి ఉండేలా ఓ నిలువెత్తు విగ్రహంలా ఈ పుస్తకాన్ని రూపొందించారు.

ఇందులో నగేష్ బాబు తొమ్మిది కవితా సంపుటాలతో పాటు కొన్ని అముద్రిత, అనువాద కవితలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ‘ప్రాథమికంగా నేను ధిక్కార కవిని. ధిక్కారం, కోపం లేకుండా ఎవరైనా రాశారంటే అది దళిత కవిత్వం కాదు, లలిత కవిత్వం అవుతుంది’ అని ప్రకటించిన మద్దూరి కవిత్వం లాలిత్యానికి దూరంగానే సాగింది. ‘నగేష్ బాబు అంటే ఒక జల ఊరడమే కాని ఎండిపోవడం ఉండదు’ అన్నట్లు తన చివరి మాటను కూడా దళితస్వరంగా మలిచారు. ‘ఈ దేశపు అగ్రకులాల వాళ్లకు విప్లవానికి సంబంధమే లేదు. దాన్ని చేయాల్సింది దళితులే’ అని ఓ ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన కూడా చేసిన ధీశాలి.
ప్రతి వివక్షకు, సామాజిక చర్యకు వెంటనే స్పందించడం మద్దూరి కవిత్వంలో చూస్తాం. ‘పరువు కోసం కూతురును లోయలోకి తోసిన తండ్రి వార్త తెలిసి ‘ఒరే లుచ్చా నాన్నా/ నేనీ లోకంలో అసహ్యించుకునే ఒకే ఒక్క మగ వెధవ్వి/ నువ్వేరా!’ అని కూతురు గొంతుతో ఈసడించుకున్నారు. ‘ఇంతవరకూ జరిగింది ఒకవైపు ఆటే! / ఇంతవరకూ జరిగింది ఒక జట్టు ఆటే!/ నేను రంగంలోకి దిగేశాను!/ ఇహ..

ఇప్పుడు మొదలవుతుంది అసలాట/ చూస్కోండి’ అని సమాజానికి ఆయన సవాలు విసిరారు. ‘తాళపత్ర గ్రంథాల మధ్య / చచ్చి అతుక్కుపోయిన దోమ కళేబరాన్ని నేను/ వక్రీకరణలు మౌఖిక సాహిత్యాల ముళ్లకిరీటాల కింద / నెత్తురోడుతున్న శూన్య శతాబ్దాలను నేను’ ఒక రాక్షసుడి ప్రకటనలో అన్నారు. సోమాలియా పరిస్థితికి చింతిస్తూ ‘ఎముకల పోగైన నీ గుప్పెడు దేహాన్ని కూడా దాచలేని/ నా ప్రపంచ వస్త్రపరిశ్రమ / ఏ పారిశ్రామికవేత్త పక్కలో తొంగుందమ్మా?’ అని ప్రశ్నించారు. ఫుట్‌పాత్‌ని కూడా మద్దూరి విడదీసి చూశారు. ‘రోడ్డు బ్రాహ్మడైపోయి ఫుట్‌పాత్‌ని హరిజనుడంటుంది?’ అని ఇందులోనూ వివక్షను పసిగట్టారు. సంతకం కవితలో ‘ఒరే పంతులూ! / మా వాళ్ళ ఏలి ముద్దర్లు సూసుకున్నప్పుడల్లా నాకు నీ మనువుగాడు గుర్తొస్తున్నాడు’ అని దళిత నిరక్షరాస్యతను గుర్తు చేస్తారు. చదువుకునే వేళ కేస్ట్ సర్టిఫికెట్ నలుగురిలో ఎలా ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తుందో రాస్తూ ‘ఇక నా కేస్ట్ సర్టిఫికెట్ / నేను రాయబోయే కొత్త చరిత్రకి / ముందు మాటవుతుంది’ అని ధైర్యాన్ని ప్రకటించారు. సాక్షి కవితలో తగలబెట్టే వెలివాడల వెతలను కంటి ముందుంచారు.‘చుట్ట ముట్టించుకున్నంత తేలిగ్గా/ పల్లెను ముట్టిస్తారు/ పొయ్యి రాజేసినంత అలవాటుగా/ మనుషుల్ని కాల్చేస్తారు’ అని పల్లె గోసను వల్లె వేశారు. మహిళల మధ్య కుల అంతరాన్ని తెలిపేలా ‘నువ్వు నేనూ ఒకటెట్ల అవుతాం తల్లీ! / పెసిడెంట్ గారి పెద్ద కొడుకు /అత్తరువాసనగొట్టే నిన్ను వొదిలేసి / మట్టికంపుగొట్టే నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో’ అని దళిత పిల్ల తరపున అడుగుతారు.

ఓ సభలో సతీష్ చందర్ నవ్వులోని ఊపును కవితగా ‘ఏమి నవ్వు నవ్వావురా నాయనా / ఇన్నాళ్ల వాళ్ళ కుల కవిత్వాన్ని/ చిటికెనవేలుతో చిదిమేసింది నీ నవ్వే కదా’ అని మళ్ళీ నవ్వించారు. రాజమహేంద్రవరంను తన కోణంలో విశ్లేషిస్తూ ‘నిన్నటి దాకా నువ్వు / దేవుళ్ళ శాపాలు సోకిన శిలవి రాజమండ్రీ / ఇప్పుడు / దళిత విమోచనా పాదాలు తాకిన మనిషివి / తుమ్ హారా నామ్ భీమ్ మండ్రి’ అని బొడ్డుకోసి పేరు పెడుతున్నానన్నారు. పదిహేడక్షరాలా యుద్ధం అంటూ ప్రయోగంగా కొన్ని పొట్టి కవితలు రాశారు. మెచ్చుకొకటి. ‘దప్పికగొని / ఈ వేదభూమి / వాడ రక్తం తాగింది’. ఇలా ఇంకొన్ని ఉన్నాయి.కవితలన్నీ పొడుగే అయినా తక్కువగా చిన్న కవితలు కూడా రాశారు. వాటిలో ‘నెలతప్పిందా ఏమిటి..!?’ అనే చమత్కార కవిత ఒకటి.

మద్దూరి ఇలా తన కవిత్వం ద్వారా దళిత జీవనంలోని అవమానాల్ని అగ్నిరజనుగా చేసి నలుదిశలా చల్లారు. ఆయన భావప్రకటనలోనీ తెగువ మరెవరు చేరని శిఖరంగా చెప్పవచ్చు. ఇందులోని ఏ కవిత చదివినా తానే కవిత్వమైనట్లు, తన జీవితాన్నే అక్షరబద్దం చేస్తున్నట్లు, తన అనుభవాలనే దీర్ఘకవితగా రాసినట్లు మద్దూరి కనబడతారు. తన అస్తిత్వాన్ని గుర్తించని అన్నింటిపై నిరసన ప్రకటించారు. రచనాశైలి విషయానికొస్తే సూటిదనానికి సరళత తోడై కవిత్వమంతా సెలయేరులా సాగింది. దళితవాద తీవ్రతతో హీటెక్కినా కవిత్వం అంతా ఒక ఫ్లో కనబడుతుంది. వచనం ఎక్కువైనా అల్లికలో భావపటిమ నిలబెట్టింది. మద్దూరి కవితలు ఇప్పటికే వెలివాడ, లోయ, మీరేవుట్లూ, నరలోక ప్రార్థన కవితా సంపుటాలుగా, రచ్చబండ, పుట్ట, గోదావరి దీర్ఘ కవితలుగా వచ్చాయి. వాటన్నిటి సమగ్ర రూపమే ఇది. ఈ పుస్తకానికి జి. లక్ష్మీనరసయ్య, చల్లపల్లి స్వరూపరాణి, డా. కోయి కోటేశ్వరరావు, శిఖామణి, డా.ఎండ్లూరి సుధాకర్, డా. పి.కేశవ కుమార్, డా. నూకతోటి రవికుమార్ ముందు మాటలు రాశారు. ఏడు రంగుల్లో మద్దూరి నగేష్ బాబు కవిత్వాన్ని వారి పదాల్లో వర్ణించారు. వీరి విశ్లేషణ సంకలనానికి ఒక సంపద. మద్దూరి కోణంలోంచి తెలుగు దళిత సాహిత్యంపై విస్తారమైన చర్చ వీటిలో ఉంది. దళిత కవిత్వంలో మద్దూరిది చెరగని సంతకం, వివక్షపై ముల్లుకర్ర.

మద్దూరి నగేష్ బాబు సమగ్ర కవిత్వం
సంపాదకులు: డా.ఖాజా,
డా. కోయి కోటేశ్వరరావు
పేజీలు 725, వెల: 1000/-
ప్రచురణ: బహుజన కెరటాలు, ఒంగోలు
ప్రతులకు : 9849944170

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News