గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రస్తుతం సాగుతున్న గణపతి ఉత్సవాల సమయంలో ఒక పందిరి వద్ద కొందరు రాళ్లు రువ్వినప్పుడు గణేశుని విగ్రహం దెబ్బ తిన్నదని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి సయ్యద్‌పురా ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన సందర్భంగా కొంత మంది మైనర్లను నిర్బంధించిన తరువాత సుమారు 300 మంది వ్యక్తుల గుంపు తమ సమాజం సభ్యులపై చర్యకు నిరసనగా లాల్‌గేట్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. అక్కడ రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయని, ఆ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డారని,
ఒక పోలీస్ వాహనం ధ్వంసమైందని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌత్ విలేకరులతో చెప్పారు. ఆ గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బ్యాటన్ చార్జ్ చేశారని, బాష్పవాయు గోళాలు ప్రయోగించారని ఆయన తెలియజేశారు. ఇంత వరకు 32 మంది వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకున్నట్లు, ఆ సంఘటనల సందర్భంగా రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గుజరాత్ హోమ్ శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి, దోషులపై కఠిన చర్యకు వాగ్దానం చేశారు.