భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట రెవెన్యూ సర్వేయర్ వెంకటరత్నం మండల కేంద్రానికి చెందిన ఓ రైతు గాంధీనగర్‌లోని తన 19.2 ఎకరాల భూమికి సంబంధించి నూతన పాస్ పుస్తకాలు అందకపోవడంతో, ధరణిలో నమోదు చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ తరుణంలో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సర్వేయర్ వెంకటరత్నం ఆ భూమిని సర్వే చేశారు.
సర్వే అనంతరం సర్వేయర్ ఆ పనులకు గాను రూ.1.50 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.50 వేలకు వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయమై బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ సూచించిన మేరకు రూ.50 వేలు బాధిత రైతు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మందలపల్లి గ్రామ శివారులో గల గాంధీనగర్ ఇటుక బట్టీల దగ్గర సర్వేయర్ ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ముందస్తుగా మాటువేసిన ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వెంటనే సర్వేయర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపారు.
మంత్రి పొంగులేటి తనిఖీ చేసిన కార్యాలయంలో 48 గంటలు గడవక ముందే..
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం దమ్మపేట రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యాలయం పై అవినీతి, ఆరోపణలు వస్తున్నాయంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ విషయంలో దమ్మపేట రెవెన్యూ కార్యాలయంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ తరుణంలోనే మంత్రి విజిట్ చేసి 48 గంటలు కూడా ముగియకముందే ఇదే కార్యాలయానికి చెందిన అధికారి ఎసిబి వలకు చిక్కడం గమనార్హం.అదేవిధంగా కరీంనగర్ జిల్లా, శంకరపట్నం తహసీల్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ ఇంద్రాల మల్లేశం ఎసిబి వలలో చిక్కుకున్నారు
. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎరడపల్లికి చెందిన కలకుంట్ల నవీన్‌రావు నాలా కన్వర్షన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆర్‌ఐ విచారణ అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ను కలవగా రూ.పది వేలు ఇవ్వాలని అడిగారు. అయితే, తాను రూ. ఆరు వేలు ఇస్తానని ఒప్పుకొని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్‌పి రమణమూర్తి సూచనల మేరకు నవీన్‌రావు డిప్యూటీ తహసీల్దార్‌కు లంచం డబ్బులు ఇవ్వగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు.