Saturday, December 21, 2024

అసలైన ఆట ఇప్పుడే మొదలైంది: దామోదర రాజనర్సింహ

- Advertisement -
- Advertisement -

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం
ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మన తెలంగాణ /హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ నెల 16 లేదా 17న సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మాదిగల సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడే ఆట మొదలైందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. జులై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, ధర్మాసనం తీర్పును అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని మంత్రి తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆత్మీయ సమ్మేళనం: ఎస్సీ వర్గీకరణపై కేవలం తీర్పు రాగానే సంతోషపడకూడదని, దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయాలని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. మాదిగ జాతి ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, అన్ని జాతులతో సమానమని, మాదిగ జాతిని అవమాణిస్తే కండిస్తాం, ఎదురిస్తామన్నారు. సీనియర్ న్యాయవాదులతో సుప్రీం తీర్పు కాపీలను క్షుణ్నంగా పరిశీలించమని చెప్పనున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు.

గతంలో ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలు ఏబీసీడీ వర్గం కరెక్ట్ కాదన్న సుప్రీంకోర్టు, నేడు సమర్థించిందని మంత్రి గుర్తు చేశారు. మాదిగల్లో మార్పు రావాలని, అందరూ సంస్కారవంతులు కావాలని మంత్రి సూచించారు. ఆర్థిక వ్యవస్థ అనేది ఏ ఒక్క వర్గం చేతిలో ఉండకూడదని, అది అత్యంత ప్రమాదకరమని మంత్రి పేర్కొన్నారు. ‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం. సుప్రీం తీర్పు కాపీలను క్షుణ్నంగా పరిశీలించడానికి సీనియర్ న్యాయవాదులను నియమించి, దాని సారాంశం ఆధారంగా రాష్ట్రంలో వర్గీకరణ చేపట్టాలని సీఎంకు విన్నవిద్దామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈసమావేశానికి కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు అందరూ హాజరయ్యారు.

సీఎం నిర్ణయం హర్షణీయం: అప్పట్లో మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. మాదిగలకు ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ తన కంటే చిన్నవాడైనా మాదిగలకు తండ్రి స్థానంలో ఉండి సహాయం చేశాడని, గ్రూప్-1, ఇతర ఉద్యోగాల్లో ఏబీసీడీ అమలు అయ్యేలా చేస్తామని సీఎం చెప్పడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News